Ram Mandir: అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ.. ఎలా జరిగిందంటే..
ABN, Publish Date - Jan 22 , 2024 | 01:29 PM
నిర్ణయించిన సమయానికే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది.
రామా కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా..! రామమందిరం.. బాలసుందరం..! అంటూ సమస్త భారతదేశం ఆ నీలమేఘశ్యాముని నామస్మరణలో మునిగిపోయింది. పితృవాక్య పరిపాలకుడైన ఆ దశరథ రాముడి దివ్య మంగళ రూప దర్శనం చేసుకుంది. తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు అంటూ..!! నీవే రక్షగా నిలవాలని భక్తకోటి శరణు వేడుకుంటోంది. రామా అని నోరార పిలిస్తే.. శ్రీరామరక్షవై వెన్నంటి ఉంటాడని ప్రత్యేక పూజలు చేస్తోంది భారతం. శ్రీరామ నీ నామమెంతో రుచిరా..!! అంటూ రామనామ ఘోషతో అయోధ్యా నగరి మారుమోగుతోంది. యజ్ఞయాగాదులు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆ బాలరాముడి బుడిబుడి అడుగుల సవ్వడితో సందడిగా మారింది.!!
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం. పట్టాభిషిక్తుడి రాజ్యాన్ని పరిపాలిస్తాడని అంతా భావిస్తున్న సమయంలో తండ్రి మాటను ధిక్కరించలేక 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన ఆ రాఘవుడు మళ్లీ తమ రాజ్యానికి విచ్చేసిన ఆధ్యాత్మిక సంబురంలో అయోధ్య నగరం పులకరిస్తోంది.
నిర్ణయించిన సమయానికే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. 11 రోజులుగా ఉపవాసంలో ఉన్న ప్రధాని మోదీ శ్రీరామచంద్రుడికి పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్న శుభముహుర్తాన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. స్వామివారికి మొదటి హారతి ప్రధాని మోదీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా పాల్గొన్నారు. అనంతరం దివ్యమైన రూపంతో శ్రీరామ చంద్రుడు భక్తులకు దర్శనమిచ్చాడు. రామయ్య దర్శన భాగ్యంతో యావత్తూ భారతదేశం పులకించిపోతోంది. బాల రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడంలేదు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో ఉన్న రామచంద్రుడిని చూసి భక్త జనం పులకించిపోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కళ ఎట్టకేలకు నెరవేరడంతో కోట్లాది మంది రామ భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రాణప్రతిష్ఠ సమయంలో గగనవీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో అన్ని రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, చిరంజీవి, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్, ముఖేష్ అంబానీ, నితా అంబానీ, ఇషా అంబానీ, రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్, అమితామ్ బచ్చన్ వంటి 7 వేల మంది అతిథులు హాజరయ్యారు. కాగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం అధ్యాత్మిక కళ ఉట్టిపడింది. రామనామ స్మరణతో అయోధ్య వీధులు కళకళలాడాయి. నగరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అయోధ్యలో ఎక్కడా చూసిన రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు దర్శనమిచ్చాయి. కళకారుల ప్రదర్శనలు చూపు తిప్పుకోనివ్వలేదు.
Updated Date - Jan 22 , 2024 | 02:13 PM