Rajya Sabha Polls: గుజరాత్ నుంచి నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్
ABN, Publish Date - Feb 14 , 2024 | 03:32 PM
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది.
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది. జేపీ నడ్డాతో పాటు గుజరాత్ నుంచి రాజ్యసభకు గోవింద్ భాయ్ ధోలకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సిన్హ్ సలామ్‌సిన్హ్ పార్మర్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. మహారాష్ట్రలో అశోక్ చవాన్‌తో పాటు మేథా కులకర్ణి, అజిత్ గోప్చడేలను బీజేపీ నామినేట్ చేసింది.
ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురు నామినేషన్
బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగిన ఏడుగురు అభ్యర్థులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో బుధవారంనాడు నామినేషన్ వేశారు. వీరిలో మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్‌వీర్ సింగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదగర్శి ఆమ్రపాల్ మౌర్య, రాష్ట్ర మాజీ మంత్రి సంగీత బల్వంత్, పార్టీ ప్రతినిధి సుధాన్షు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్ ఉన్నారు. నామినేషన్ సందర్భంగా సీఎంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, బీజేపీ యూపీ లోక్‌సభ ఇన్‌చార్జి బైజయంత్ పాండే హాజరయ్యారు. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా, ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది.
Updated Date - Feb 14 , 2024 | 03:32 PM