టీఎం కృష్ణకు ‘సంగీత కళానిధి’ అవార్డుకు బ్రేక్
ABN, Publish Date - Nov 20 , 2024 | 04:34 AM
మద్రాసు మ్యూజిక్ అకాడమీ 2024 సంవత్సరానికిగాను ప్రముఖ గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణకు ఇవ్వదలచిన ‘సంగీత కళానిధి’ అవార్డుకు మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది.
చెన్నై, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మద్రాసు మ్యూజిక్ అకాడమీ 2024 సంవత్సరానికిగాను ప్రముఖ గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణకు ఇవ్వదలచిన ‘సంగీత కళానిధి’ అవార్డుకు మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మనవడు శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం ఈ మేరకు స్టే విఽధించింది. 2004లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మరణానంతరం మద్రాసు మ్యూజిక్ అకాడమీ ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వాహకులతో కలిసి ఆమె పేరుతో ఏటా ప్రతిభావంతులైన కర్నాటక సంగీత విద్వాంసులకు ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ యేడాది ఈ అవార్డుకు గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణను ఎంపిక చేసింది. అయితే తన బామ్మ సుబ్బులక్ష్మి కీర్తిప్రతిష్ఠలకు భంగం కలిగించేలా గతంలో విమర్శలు చేసిన టీఎం కృష్ణకు ఆమె పేరుతో అవార్డు ఇవ్వకూడదని శ్రీనివాసన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.జయచంద్రన్.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పేరుతో టీఎం కృష్ణకు అవార్డును ప్రదానం చేయడాన్ని నిలుపుదల చేశారు. అయితే, టీఎం కృష్ణకు మరో పేరుతో అవార్డు ప్రదానం చేసుకోవచ్చని సూచించారు.
Updated Date - Nov 20 , 2024 | 04:35 AM