ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి లంచాలు
ABN, Publish Date - Nov 08 , 2024 | 03:09 AM
విధేయులైన మహారాజులు, నవాబులకు లం చాలు ఇవ్వడం, వారిపై బెదిరింపులకు పాల్పడటం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని అణచివేసిందంటూ కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ రాసిన వ్యాసం రాజకీయదుమారం రేపింది.
ఇదీ మహారాజులు, నవాబుల బాగోతం..
రాహుల్‌గాంధీ వ్యాసంపై రాజకీయ దుమారం
రాజవంశీయ బీజేపీ నేతల ఫైర్
న్యూఢిల్లీ/ముంబై, నవంబరు7: విధేయులైన మహారాజులు, నవాబులకు లం చాలు ఇవ్వడం, వారిపై బెదిరింపులకు పాల్పడటం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని అణచివేసిందంటూ కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ రాసిన వ్యాసం రాజకీయదుమారం రేపింది. ఈ వ్యాసం బుధవారం ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది. దీన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సహా రాజకుటుంబాలకు చెందిన బీజేపీనేతలు తీవ్రంగా ఖండించారు. విద్వేషాన్ని ప్రేరేపించేవారికి దేశగౌరవం, చరిత్ర గురించి ఉపన్యాసాలు ఇచ్చే హక్కులేదని సింధియా మండిపడ్డారు. నాటి రాజుల త్యాగాలతోనే సమగ్ర భారతదేశం కల నెరవేరిందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దివ్యకుమారి ‘ఎక్స్’లో స్పష్టంచేశారు. భారతదేశం కోసం నాటి రాజ కుటుంబాలు చేసిన త్యాగాలపై రాహుల్‌గాంధీలోని అజ్ఞానం ఆ వ్యాసం ద్వారా బట్టబయలైందని లోక్‌సభ సభ్యుడు యదువీర్ వడియార్ ‘ఎక్స్’లో విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ధారణకు రావొద్దని రాహుల్‌కు బీజేపీ హితవు పలికింది. రాహుల్ వ్యాసం చదివితే నవ్వొస్తోందని కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. కాగా ఈస్ట్‌ఇండియా కంపెనీకి సింధియా రాజులు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలుసని కాంగ్రెస్ మీడియా-పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పవన్‌ఖేరా ఎద్దేవా చేశారు. బీజేపీనేతల విమర్శలపై రాహుల్ స్పందించారు. వ్యాపారాలను తాను వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీనేతలు ప్రచారం చేస్తున్నారని, తాను గుత్తాధిపత్యానికి మాత్రమే వ్యతిరేకమని ‘ఎక్స్’లో స్పష్టంచేశారు. కాగా రాజ్యాంగాన్ని కాపాడాలంటూ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాహుల్‌గాంధీ నిర్వహించిన సభపై బీజేపీ మండిపడింది. ఆ సభలో కేవలం తెల్లపేపర్లతో కూడిన రాజ్యాంగం కాపీలను రాహుల్ పంపిణీ చేశారంటూ విమర్శించింది.
Updated Date - Nov 08 , 2024 | 03:09 AM