రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు!
ABN, Publish Date - Dec 15 , 2024 | 04:49 AM
జమిలి ఎన్నికల బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 14: జమిలి ఎన్నికల బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. తరచూ ఎన్నికలు జరుగుతూ ప్రతి రోజూ దేశంలో ఏదో మూల ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న బృహత్తక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తలకెత్తుకుంది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో 82ఏ పేరుతో కొత్త ఆర్టికల్‌ను చేరుస్తారు. ఆర్టికల్ 83(పార్లమెంటు ఉభయ సభల కాలవ్యవధి), ఆర్టికల్ 172(శాసనసభల కాల వ్యవధి), ఆర్టికల్ 327(చట్ట సభలకు ఎన్నికల విషయంలో పార్లమెంటుకు నిబంధనలను రూపొందించే అధికారం)లను సవరిస్తారు. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందిన తర్వాత తదుపరి పార్లమెంటు తొలిసారి సమావేశమయ్యే తేదీని రాష్ట్రపతి ప్రకటిస్తారు. దాన్ని అపాయింటెడ్ డేట్ అంటారు. అంతకుముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. పార్లమెంటు కాలపరిమితి అపాయింటెడ్ డేట్ నుంచి ఐదేళ్లలో ముగిసిపోతుంది.
అన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి కూడా అదే పద్ధతిలో ముగిసిపోతుంది. లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభ కానీ, శాసనసభ కానీ కాలపరిమితి పూర్తి కాకుండానే రద్దయితే ఐదేళ్లలో మిగిలిన కాలానికి ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేస్తారు. 1951-52, 1957, 1962, 1967 సంవత్సరాల్లో జమిలి ఎన్నికలే జరిగాయని బిల్లులో గుర్తు చేశారు. 1968, 69 సంవత్సరాల్లో కొన్ని శాసనసభలను అర్ధాంతరంగా రద్దు చేయడంతో ఆ క్రమం తప్పిందని ప్రస్తావించారు. కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సూచన మేరకు ఒకే దేశానికి ఒకే ఎన్నిక విధానాన్ని ఎంచుకున్నట్లు బిల్లు ఉద్దేశాల్లో పేర్కొన్నారు. కోవింద్ కమిటీ స్థానిక సంస్థలను కూడా చేర్చాలని సూచించినా ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దాంతో సగం రాష్ట్రాల ఆమోదం పొందాల్సిన అవసరం లేకుండా పోయింది. అసెంబ్లీలతో పాటే పలు కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభకు ఎన్నికలు నిర్వహించేందుకు మరో బిల్లును ఆమోదించనున్నారు.
Updated Date - Dec 15 , 2024 | 05:07 AM