ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాలే
ABN, Publish Date - Mar 23 , 2024 | 04:11 AM
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్ష పాత్ర పోషించారు. మద్యం విధానంతో లబ్ధి పొందిన వారి నుంచి నేరుగా ఆయనే ముడుపులు డిమాండ్ చేశారు. లిక్కర్ వ్యాపారులు, వ్యక్తుల నుంచి ముడుపులు వసూలు చేశారు. సీఎం హోదాలో మద్యం కుంభకోణానికి ఆయనే ప్రధాన సూత్రధారి’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. సౌత్ లాబీకి నాయకత్వం
మద్యం స్కాంలో ఆయనే ప్రధాన సూత్రధారి
రూ.45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలున్నాయ్
కేజ్రీ తరఫున విజయ్ నాయర్ రూ.100 కోట్లు తీసుకున్నారు
క్యాబినెట్ ఆమోదించకముందే కవిత ఆడిటర్ బుచ్చిబాబు
మొబైల్ ఫోన్‌లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది
కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు
మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు
చెన్నైలో ఎక్కడ, ఎలా ముట్టచెప్పారో రాఘవ తెలిపారు
నాయర్‌తో కలిసి పని చేయాలని కేజ్రీ చెప్పినట్లు శరత్‌రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు..
కస్టడీ రిపోర్టులో ఈడీ
కేజ్రీవాల్‌కు 6 రోజుల కస్టడీ
28 వరకూ విచారణకు అనుమతి
బలవంతంగా అప్రూవర్లుగా మార్చి ప్రకటనలు ఇప్పించారు
ఎన్నికలకు ముందే ఫలితాలను సాధించాలనుకుంటున్నారు
కేజ్రీవాల్ తరఫున బలంగా వాదించిన న్యాయవాది సింఘ్వి
న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ‘ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్ష పాత్ర పోషించారు. మద్యం విధానంతో లబ్ధి పొందిన వారి నుంచి నేరుగా ఆయనే ముడుపులు డిమాండ్ చేశారు. లిక్కర్ వ్యాపారులు, వ్యక్తుల నుంచి ముడుపులు వసూలు చేశారు. సీఎం హోదాలో మద్యం కుంభకోణానికి ఆయనే ప్రధాన సూత్రధారి’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. సౌత్ లాబీకి నాయకత్వం వహించిన కవిత తదితరులకు అక్రమంగా లాభాలు ఆర్జించిపెట్టేందుకు వీలుగా కేజ్రీ ఈ విధానాన్ని రూపొందించారని వివరించింది. ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టు చేసిన కేజ్రీవాల్‌ను ఈడీ శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూలో మనీలాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. ఆయనను పది రోజులపాటు కస్టడీలో ఇంటరాగేషన్ చేయడానికి అనుమతించాలని కోరింది. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 కింద ఎన్నిసార్లు సమన్లు పంపినా హాజరు కాకుండా ఆయన తప్పించుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద ఆయన నేరానికి పాల్పడ్డారని ధ్రువీకరించింది. ఈ మేరకు 32 పేజీల దరఖాస్తు (కస్టడీ రిపోర్ట్)ను సమర్పించింది. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి నాయకుడు కే జ్రీవాల్ మాత్రమే. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు. మద్యం విధానంతో ప్రయోజనాలు పొందిన వారి నుంచి ముడుపులు నేరుగా ఆయనే డిమాండ్ చేశారు. తద్వారా వచ్చిన రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి’’ అని తెలిపింది. ఈడీ దరఖాస్తులోని మరిన్ని వివరాలు..
సీఎం హోదాలో ఢిల్లీ మద్యం కుంభకోణానికి కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి. అప్పటి ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఆప్ నేత విజయ్ నాయర్, ఇతర మంత్రులతో కలిసి ఆయన కుట్ర పన్నారు. కొందరికి అక్రమ ప్రయోజనాలు సమకూర్చేందుకు వీలుగా ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారు.
మంత్రివర్గం(జీవోఎం) ఆమోదించాల్సిన మద్యం విధానాన్ని రూపొందించేందుకు అవసరమైన 30 పేజీల డాక్యుమెంట్‌ను కేజ్రీవాల్ నివాసంలో సదరు శాఖ మంత్రి సిసోడియా తనకు ఇచ్చారని సిసోడియా కార్యదర్శి అరవింద్ చెప్పారు. హోల్‌సేల్ వ్యాపారం మార్జిన్‌ను 12ు మేరకు నిర్ణయించింది ఇందులోనే. కానీ, ఈ నివేదికపై జీవోఎం సమావేశాల్లో ఎప్పుడూ చర్చించలేదు.
కేజ్రీవాల్, సిసోడియాతో విజయ్ నాయర్ నేరుగా చర్చించేవారు. ఆయన ఆప్ తరఫున దళారీగా వ్యవహరించారు. ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా కేజ్రీవాల్ ఇంటి సమీపంలోని ఓ క్యాబినెట్ మంత్రి బంగళాలో నివసించారు.
సౌత్ లాబీ యజమానులైన కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ రెడ్డిల నుంచి రూ.100 కోట్ల ముడుపులను విజయ్ నాయరే స్వీకరించారు. ఈ గ్రూప్‌కు అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు. మద్యం విధానం రూపకల్పనపై విజయ్ నాయర్‌తో తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై చర్చించారు. కవితకు ప్రయోజనాలు కట్టబెట్టాలని నాయర్ అనుకున్నారని కవిత ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారు.
మంత్రి మండలి ఆమోదించక ముందే బుచ్చిబాబు మొబైల్ ఫోన్‌లో మద్యం విధానం కాపీ దొరికింది. అందుకు సంబంధించి విజయ్ నాయర్‌తో జరిపిన సంభాషణలు కూడా లభ్యమయ్యాయి.
అభిషేక్ బోయినపల్లి రూ.100 కోట్లను విజయ్ నాయర్‌కు, ఆయన సహచరులకు రకరకాల పద్ధతుల్లో బదిలీ చేశారు. ఇందుకు బదులుగా సౌత్ లాబీకి ఇండో స్పిరిట్ హోల్‌సేల్ వ్యాపారం, కొన్ని రిటైల్ షాపులు, పెర్నార్డ్ వ్యాపారం, ఎల్ వన్ లైసెన్స్ లభించాయి.
సౌత్ లాబీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ముడుపులు డిమాండ్ చేసినట్లు పలు ఆధారాలు లభించాయి. ప్రముఖ మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన ప్రకటన ఇందుకు సాక్ష్యం. సీఎం కార్యాలయంలో ఆయన కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. కవితతో రూ.100 కోట్ల మేరకు ముడుపులకు బేరం కుదిరినట్లు కేజ్రీవాల్ తనకు చెప్పారని మాగుంట తెలిపారు. ఆయన సలహా మేరకు తాను కవితను కలిశానని చెప్పారు. అప్పుడే ఆమె రూ.50 కోట్లు చెల్లించాలని తనను కోరారని, తన కుమారుడు రాఘవ కవిత మనుషులు అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబులకు రూ.25 కోట్లు ముట్టచెప్పారని శ్రీనివాసులు రెడ్డి చెప్పారని వివరించింది. రాఘవ మాగుంట కూడా ఈ విషయాలను ధ్రువీకరించారు. ఇక అరబిందో సంస్థ యజమాని శరత్ రెడ్డి కూడా తాను అరుణ్ పిళ్లై, విజయ్ నాయర్ ద్వారా కేజ్రీవాల్‌ను కలిసిన తీరును వివరించారు. నాయర్‌తో కలిసి పని చేయాలని కేజ్రీవాల్ తనకు చెప్పారని ఈడీకి వివరించారు.
నా జీవితం దేశానికే అంకితం
తన జీవితం దేశానికే అంకితమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన శుక్రవారం ఈడీ కార్యాలయం వద్ద తనకు ఎదురైన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్నా, వెలుపల ఉన్నా తన జీవితం దేశానికే అంకితమని వ్యాఖ్యానించారు.
ఆరు రోజుల కస్టడీకి కేజ్రీవాల్
న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మనీ లాండరింగ్ చట్టం కింద కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనని, రూ.100 కోట్ల మేర ముడుపులను తీసుకోవడంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. కేజ్రీవాల్ వాస్తవాలు వెల్లడించలేదని, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లిందో ఆయన నుంచి రాబట్టాల్సి ఉందని తెలిపారు. దర్యాప్తునకు సీఎం సహకరించలేదని, అందుకే కస్టడీకి కోరాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19 కింద ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే నేరం చేసినట్లు రుజువు చేయాలని, ఇంతవరకూ ఈడీ ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం సమర్పించలేదని సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, విక్రం చౌదరి, రమేశ్ గుప్తా వాదించారు. కేజ్రీవాల్‌ను నిందితుడిగా విచారిస్తున్నట్లు నిన్నటి వరకూ ఈడీ చెప్పలేదని తప్పుబట్టారు. ‘‘కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్షులు ముందుగా ఎలాంటి వివరాలు చెప్పలేదు. అరెస్టు చేసి.. బెయిల్ నిరాకరించిన తర్వాతే వారు ప్రకటనలు చేశారు. వారిని బలవంతంగా అప్రూవర్లుగా మార్చారు. దేశ చరిత్రలో ఇలా ఒక సీఎంను అరెస్టు చేయడం ఇదే ప్రథమం. సార్వత్రిక ఎన్నికలను ఈ అరెస్టులు ప్రభావితం చేస్తాయి’’ అని సింఘ్వీ వాదించారు. కాగా, కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆప్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. డీడీయూ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు నిరసన తెలిపాయి. దీంతో డీడీయూ మార్గ్‌లో సెక్షన్ 144ను విధించారు. నిరసన తెలిపిన మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్ నిరసనలతో ఢిల్లీలోని పలు మెట్రోస్టేషన్లను మూసి వేశారు.
Updated Date - Mar 23 , 2024 | 04:11 AM