CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. గవర్నర్ గావుకేకలకు రాజకీయమే కారణం..
ABN, Publish Date - Jan 23 , 2024 | 01:41 PM
స్థానిక టి.నగర్‌లోని కోదండరామాలయ అర్చకులు, సిబ్బంది ముఖాల్లో భయాందోళనలు కనిపించాయంటూ గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) తీవ్రంగా స్పందించారు.
- వదంతులను నమ్మించడంలో బీజేపీ పెద్దలు దిట్టలు
- సీఎం స్టాలిన్ ధ్వజం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక టి.నగర్‌లోని కోదండరామాలయ అర్చకులు, సిబ్బంది ముఖాల్లో భయాందోళనలు కనిపించాయంటూ గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) తీవ్రంగా స్పందించారు. ఆ విమర్శల వెనుక బలమైన రాజకీయ కారణాలు దాగి ఉన్నాయని మండిపడ్డారు. వదంతులను నమ్మించడంలో బీజేపీ పెద్దలు నిష్ణాతులన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఆయన పార్టీ శ్రేణులకు లేఖ రాస్తూ... గవర్నర్ వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ఓ వదంతిని వాట్సప్, టెలివిజన్, వార్తాపత్రికలు తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయించి దాన్ని నిజమేనని ప్రజలు నమ్మేలా చేయడంలో బీజేపీ పెద్దలు ఆరితేరారని, ఈ విషయంలో ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్రంలోని బీజేపీ నేతల వరకూ ఎవరికీ మినహాయింపు లేదని పేర్కొన్నారు. అనునిత్యం వదంతులను వ్యాపింపచేయడంలో బీజేపీ పెద్దలు ‘వాట్సప్ యూనివర్శిటీలు’గా ఉన్నారని చెబితే అతిశయోక్తి కాదన్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి బీజేపీ నేతలు రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలపై ఆంక్షలు విధించారని ఓ వదంతిని పుట్టించారని, ఆ సమయంలో డీఎంకే యువజన విభాగం మహానాడు సభలో ఉన్న ఆ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) అవన్నీ అవాస్తవాలని వివరణ ఇచ్చారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వంపై, దేవాదాయ శాఖ మంత్రిపై తప్పుడు ఆరోపణలతో చేసిన రాద్దాంతం కూడా అందరికీ విస్మయం కలిగించిందన్నారు. సోమవారం కాంచీపురం కామాక్షి ఆలయంలో అయోధ్య ఆలయ వేడుకల సందర్భంగా భజన కార్యక్రమాలకు మాత్రమే అనుమతి తీసుకుని అక్కడ అయోధ్య ప్రత్యక్ష ప్రసారాల వీక్షణకు ఎల్‌ఈడీ స్ర్కీన్ ఏర్పాటు చేశారని, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ స్ర్కీన్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తే డీఎంకే సర్కారుకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ బెదిరింపు ధోరణితో వ్యాఖ్యలు చేయడం మంత్రిగా ఆమె బాధ్యతారాహిత్యాన్ని చాటిచెబుతోందన్నారు. బీజేపీ పెద్దల వదంతులను వ్యాపింపచేయడాన్ని మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా ఖండించిందన్నారు. ఏ మతానికి చెందినదైనా భక్తి అనేది ప్రజలకు సంతోషాన్ని, ప్రశాంతతను కల్పించాలే తప్ప... సమాజంలోని సమైక్యతకు భంగం కలిగించకూడదన్నారు. రాష్ట్రంలో నియమిత గవర్నర్ పదవిలో ఉన్న రవి తన ఎక్స్ పేజీలో మాంబళం కోదండరామాలయానికి వెళ్లినప్పుడు పూజలు, ఆలయ సిబ్బంది ముఖాల్లో ఏదో తెలియని భయాందోళనలు కనిపించాయంటూ వ్యాఖ్యానించడం గర్హనీయమన్నారు. తమకెలాంటి భయాందోళనలు లేవని ఆ ఆలయ పూజారులు, సిబ్బంది మొత్తుకున్నా పట్టించుకోకుండా వ్యాఖ్యానించడం రాజకీయ కారణం తప్ప మరొకటి కాదని స్టాలిన్ కటువుగా వ్యాఖ్యానించారు.
28న స్టాలిన్ స్పెయిన్ పయనం
పెట్టుబడుల సమీకరణ దిశగా సీఎం స్టాలిన్ ఈ నెల 28న స్పెయిన్‌కు పయనమవుతున్నారు. 2030లోగా వన్ ట్రిలియన్ అమెరికా డాలర్లకు రాష్ట్ర ఆర్థిక ప్రగతిని సాధించాలని లక్ష్యంతో ఈ నెల 8, 9 తేదీల్లో నందంబాక్కం ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు విజయవంతమైంది. అదే సమయంలో అంచనాలకు మించి 6.64లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి సంస్థలు, భారతీయ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పరిస్థితులలో స్పెయిన్‌కు వెళ్ళి అక్కడ జరిగే ఆర్థిక సదస్సులో స్టాలిన్ పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు ఆయన స్పెయిన్‌లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు గల సదుపాయాలను గురించి వారికి వివరించనున్నారు. స్టాలిన్‌తోపాటు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా, ఆ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా స్పెయిన్‌లో పర్యటించనున్నారు.
Updated Date - Jan 23 , 2024 | 01:41 PM