అయోధ్యలో కుంగిన రామ్‌పథ్!
ABN, Publish Date - Jun 30 , 2024 | 01:28 AM
అయోధ్యలో రూ.311 కోట్ల వ్యయంతో నిర్మించిన రామ్‌పథ్ తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కుంగిపోతోంది.
రహదారిపై భారీ గుహలను తలపించేలా గోతులు
వర్షాలకు ఛిద్రమైన రామమందిరానికి వెళ్లే మార్గం
ఆరుగురు మునిసిపల్ అధికారులపై సస్పెన్షన్ వేటు
లఖ్‌నవూ జూన్ 29: అయోధ్యలో రూ.311 కోట్ల వ్యయంతో నిర్మించిన రామ్‌పథ్ తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కుంగిపోతోంది. రామమందిరానికి దారితీసే 14 కిలోమీటర్ల ఈ వలయాకార రహదారిపై ఆలయ గేటుకు అర కిలోమీటరు దూరంలోనే ఒక మీటరు వ్యాసార్థం కలిగిన గొయ్యితో పాటు ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో 6 మీటర్ల వ్యాసార్థంతో మరో రెండు భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇక అయోధ్యధామ్ రైల్వేస్టేషన్‌లో నిర్మించిన 40మీటర్ల పొడవైన ప్రహరీ సైతం కుప్పకూలింది. పలు ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను వాన నీరు ముంచెత్తింది. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ధ్వంసమైందని, ఆలయ నిర్మాణానికి ముందు ఇలాంటి సమస్యలు ఎన్నడూ లేవని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు పూర్తిచేయడమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. కాగా, పలు ప్రాంతాల్లో రోడ్డు కుంగిపోయిన నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఈ పనుల కోసం రోడ్లను దిగ్బంధించడంతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు. దీనిపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు మునిసిపల్ అధికారులను సస్పెండ్ చేసింది. మరోవైపు భారీ వర్షాలతో రామమందిరం గర్భగుడి పైకప్పు లీకయిందని ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఇటీవల ఆరోపించారు. కాగా, అయోధ్య రామమందిరం నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రార్థనా స్థలాలు కూడా బీజేపీకి దోపిడీ వనరులుగా మారాయని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jun 30 , 2024 | 01:28 AM