ఆకాశంలో డేగ కన్ను..
ABN, Publish Date - May 04 , 2024 | 05:17 AM
భారత్‌కు చెందిన రక్షణ, ఏరోస్పేస్ కంపెనీ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్.. కీలక మైలురాయిని సాధించింది.
తొలి స్వదేశీ బాంబర్ యూఏవీ ఆవిష్కరణ
బెంగళూరు, మే 3: భారత్‌కు చెందిన రక్షణ, ఏరోస్పేస్ కంపెనీ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్.. కీలక మైలురాయిని సాధించింది.
భారత్‌లో తొలిసారిగా రూపొందించిన స్వదేశీ బాంబర్ మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్-200బీని బెంగళూరు వేదికగా శుక్రవారం ఆవిష్కరించింది.
‘భారతదేశ డేగ కన్ను’గా భావిస్తున్న ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ (ఎఫ్‌డబ్ల్యూడీ)-200బీ అనేది ‘మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (మేల్) మానవ రహిత యుద్ధ విమానం.
100 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగిన యూఏవీ... ఆప్టికల్ సర్వేలెన్స్ పేలోడ్లతోపాటు వైమానిక ఆయుధాలను కూడా మోసుకెళ్లగలదని ఆ సంస్థ తెలిపింది.
బెంగళూరులో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ వ్యవస్థాపకుడు సుహాస్ తేజస్కంద మాట్లాడుతూ.. డీఆర్‌డీవో వంటి సంస్థలు ఈ తరహా యూఏవీని తయారు చేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యాయని చెప్పారు.
దేశీయంగా యూఏవీని తయారు చేయాలనే భారత చిరకాల స్వప్నాన్ని ఎఫ్‌డబ్ల్యూడీ-200బీ సాకారం చేసిందని అన్నారు.
అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న యూఎస్ ప్రిడేటర్ డ్రోన్ ఖరీదు రూ.250 కోట్లు కాగా, ఎఫ్‌డబ్ల్యూడీ-200బీ కేవలం రూ.25 కోట్లకే లభిస్తుందని తెలిపారు. ఈ యూఏవీ గరిష్ట వేగం గంటకు 370 కిలోమీటర్లు. ఇది ఒకసారి గాల్లోకి ఎగిరితే 12 నుంచి 20 గంటల వరకు ప్రయాణించగలదు.
Updated Date - May 04 , 2024 | 05:17 AM