EC : 5 దశల్లో.. 50.72 కోట్ల మంది
ABN, Publish Date - May 26 , 2024 | 06:19 AM
ఎన్నికల్లో ఒక్కో దశలో ఎంతమంది ఓటర్లు ఓటు వేశారన్న వివరాలను ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం వెల్లడించింది. ఐదు దశల పోలింగ్‌లో మొత్తం 50.72 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొంది. ఒక్కో దశ వారీగా కూడా వివరాలను ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
5 దశల్లో.. 50.72 కోట్ల మంది
పోలింగ్ వివరాలు వెల్లడించిన ఈసీ
న్యూఢిల్లీ, మే 25: ఎన్నికల్లో ఒక్కో దశలో ఎంతమంది ఓటర్లు ఓటు వేశారన్న వివరాలను ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం వెల్లడించింది. ఐదు దశల పోలింగ్‌లో మొత్తం 50.72 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొంది. ఒక్కో దశ వారీగా కూడా వివరాలను ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఐదు దశలకు కలిపి నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 76.41 కోట్ల మంది కాగా, వీరిలో 50,72,97,288 మంది ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీ దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఈసీ, పోలింగ్ శాతాన్నే వెల్లడిస్తోందిగానీ పోలైన ఓట్ల సంఖ్యను తెలియజేయటం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఏడీఆర్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. పోలింగ్‌బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలను తెలిపే ఫాం 17సీలను ఈసీ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే విధంగా ఆదేశించాలని కోరింది. అయితే, సుప్రీంకోర్టు అందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, ఈసీ తనంతట తానే పోలైన ఓట్ల వివరాలను వెల్లడించటం విశేషం. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలపై ఈసీ వివరణ ఇస్తూ.. ఎన్నికల ప్రక్రియను గందరగోళపర్చటానికి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తింది.
పారదర్శకంగా నిర్వహిస్తున్నాం
పోలింగ్‌బూత్‌ల వారీగా పోలైన మొత్తం ఓట్ల వివరాలు ఫాం 17సీలలో ఉంటాయని, ఎన్నికల్లో పాల్గొనే ప్రతీ అభ్యర్థి తాలూకు పోలింగ్ ఏజెంట్లకు ఈ ఫాంలను అందజేయటం జరుగుతుందని ఈసీ గుర్తు చేసింది. దాదాపు 10.5 లక్షల పోలింగ్ బూత్‌ల వారీ వివరాలు ఈ విధంగా పోలింగ్ ఏజెంట్ల వద్ద ఉంటాయని, పోలైన ఓట్ల సంఖ్యను మార్చటం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు రోజున ఏజెంట్లు లేదా అభ్యర్థులు 17సీ కాపీలను తమ వెంట తెచ్చుకొని, ప్రతీ రౌండ్‌లో పోలైన ఓట్లను సరిపోల్చుకుంటారని పేర్కొంది. పోలింగ్ శాతాన్ని వెల్లడించటంలో జాప్యం జరుగుతోందన్న విమర్శపై ఈసీ స్పందిస్తూ.. ఓటర్ టర్న్‌అవుట్ యాప్‌లో పోలైన ఓట్ల వివరాలు అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది. పోలింగ్ జరిగే రోజున ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ప్రతీ రెండుగంటలకు ఒకసారి పోలింగ్‌శాతంపై అంచనాలను వెలువరిస్తుంటామని, అర్ధరాత్రి తర్వాత మొత్తం పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తున్నాని పేర్కొంది. పోలైన ఓట్ల వివరాలను ఈసీ వెల్లడించటంపై సామాజిక కార్యకర్తలు హర్షం వెలిబుచ్చుతున్నారు. ఇది ప్రజల విజయమని అంజలి అనే సామాజిక కార్యకర్త పేర్కొన్నారు.
కావాలనే అనుమానాలు!
మన ఎన్నికల వ్యవస్థ ఎంతో బలమైనది. 70-72 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఎటువంటి పొరపాట్లు జరగవు. కానీ, కొందరు పనిగట్టుకొని అనుమానాలు సృష్టిస్తుంటారు. ఈ అనుమానాలు ఎలా పుడుతుంటాయి.. ఎవరు సృష్టిస్తుంటారు.. దీనివల్ల మా శక్తిసామర్థ్యాలు ఎలా పక్కదారి పట్టాయనే విషయాలను ఒకరోజు దేశానికి తెలియజేస్తాం.
- రాజీవ్ కుమార్, సీఈసీ
Updated Date - May 26 , 2024 | 06:19 AM