ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాలిపోయిన అరుణతార

ABN, Publish Date - Sep 13 , 2024 | 05:52 AM

ఒక అరుణతార రాలిపోయింది. అరుణారుణ పోరుబాటపై అజరామర ముద్ర వేసిన కామ్రేడ్‌ ఇక లేరు.

సీపీఎం అగ్రనేత ఏచూరి కన్నుమూత

న్యుమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో మృతి

చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం

విద్యార్థి నాయకుడిగా ఎస్‌ఎ్‌ఫఐపై ముద్ర

ఎమర్జెన్సీ కాలంలో పీహెచ్‌డీని పక్కనపెట్టి.. పోరుబాట

రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్‌, చంద్రబాబు, పవన్‌ నివాళులు

పాలస్తీనాపై దాడికి వ్యతిరేకంగా..

నిరంతరం ఉద్యమాల్లో పాల్గొంటూ, తన ఉపన్యాసాలతో మంత్రముగ్ధుల్ని చేసే ఏచూరి.. చివరిసారి జూన్‌లో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడికి నిరసనగా ఏర్పాటు చేసిన ప్రదర్శన అది. ఆ విషయంలో భారత్‌ తన ధోరణిని వెల్లడించాలని డిమాండ్‌ చేస్తూ.. అమెరికాపై మండిపడ్డారు.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఒక అరుణతార రాలిపోయింది. అరుణారుణ పోరుబాటపై అజరామర ముద్ర వేసిన కామ్రేడ్‌ ఇక లేరు. పీడిత, తాడిత, అణగారిన వర్గాలవైపు నిలబడి.. వారి గొంతుకై ఎలుగెత్తిన వామపక్ష యోధుడు.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత నెల 19న ఆయన న్యుమోనియాతో బాధపడుతూ.. ఎయిమ్స్‌లో చేరారు. ఛాతీభాగంలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ ఉండడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం మధ్యాహ్నం 3.05 గంటలకు ఆయన కన్నుమూశారు. ఎయిమ్స్‌ ఈ విషయాన్ని ఒక హెల్త్‌ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. సీపీఎం మీడియా విభాగంకూడా ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఏచూరి భార్య సీమా చిస్తీ ప్రస్తుతం న్యూస్‌ పోర్టల్‌ ‘ద వైర్‌’కు ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా.. ఒక కుమారుడు ఆశిష్‌ 2021లో కొవిడ్‌తో చనిపోయారు. కుమార్తె అఖిల.. ప్రస్తుతం ఎడింబరో విశ్వవిద్యాలయం, సెయింట్‌ ఆండ్రూస్‌ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. వామపక్షవాదులు, కార్యకర్తలకు ప్రేరణగా నిలిచిన సీతారాం ఏచూరి.. భారత రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు. విద్యార్థి దశ నుంచి.. తన జీవిత చరమాంకం వరకూ.. సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నెన్నో ఉద్యమాలు నడిపారు. మరణం తర్వాత కూడా ఆయన తన పార్థివ దేహాన్ని ఎయిమ్స్‌కు అందజేయాలని కోరేవారు. భవిష్యత్‌ తరాల వైద్యుల బోధనకు, వారి పరిశోధనలకు తన శరీరాన్ని ఉపయోగించుకోవాలనేది ఆయన ఆకాంక్ష. కుటుంబ సభ్యులు ఆ ఆకాంక్షను నెరవేరుస్తూ.. ఎయిమ్స్‌కు ఆయన దేహాన్ని అప్పగించనున్నట్లు ప్రకటించారు. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీవర్గాల దర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఢిల్లీలోని ఏకే గోపాలన్‌ భవన్‌లో ఉంచుతామని సీపీఎం వర్గాలు ప్రకటించాయి. ఏచూరి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌, సీపీఐ నేత డి.రాజా తదితరులు సంతాపం తెలియజేశారు.


చదువుల్లో మేటి..

సీతారాం ఏచూరి పూర్వీకుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌. ఆయన 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏపీఎ్‌సఆర్టీసీలో ఇంజనీరుగా.. తల్లి కల్పకం ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన మోహన్‌ కందా.. సీతారాం ఏచూరికి స్వయానా మేనమామ. హైదరాబాద్‌లో పెరిగిన ఏచూరి చదువుల్లో మేటి. పదో తరగతివరకూ హైదరాబాద్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో చదువుకున్నారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో.. ఉన్నత విద్య కోసం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్‌ ఎస్టేట్‌ స్కూల్‌లో (సీబీఎ్‌సఈ) 12వ తరగతి వరకూ చదివి.. ఆలిండియా టాపర్‌గా నిలిచారు. అనంతరం సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో అర్థశాస్త్రంలో డిగ్రీ (బీఏ ఆనర్స్‌) చదివి ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో ఎంఏ (అర్థశాస్త్రం)లో పట్టా పుచ్చుకున్నారు. తర్వాత పీహెచ్‌డీ ప్రారంభించారుగానీ.. ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆయన చదువుకు ఫుల్‌స్టాప్‌ పడింది.

విద్యార్థి నేతగా..

జేఎన్‌యూలో చదువుతున్నప్పుడే.. సీతారాం ఏచూరి సీపీఎం స్టూడెంట్స్‌ వింగ్‌ భారత విద్యార్థి సమాఖ్య(ఎ్‌సఎ్‌ఫఐ)లో పనిచేశారు. మూడు సార్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతగా ఎన్నికయ్యారు. మరో వామపక్ష నేత ప్రకాశ్‌ కరాట్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్షాలకు కంచుకోటగా మార్చారు. ఆ తర్వాత ఎస్‌ఎ్‌ఫఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా సేవలందించారు. ఎమర్జెన్సీ రావడంతో పూర్తిస్థాయిలో ఉద్యమాల వైపు మళ్లారు. అరెస్టయ్యారు. కొన్నాళ్లు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. తెలుగుతోపాటు.. తమిళం, బెంగాలీ, హిందీ, ఆంగ్లం, తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడే సీతారాం ఏచూరి సీపీఎంలో అంచెలంచెలుగా అనేక పదవులను చేపట్టి.. ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. విద్యార్థి నేతగా ఉన్న ఏచూరి ప్రతిభాపాటవాలను గుర్తించిన సీపీఎం అధిష్ఠానం.. 1984లో ఆయనను కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించింది. 1995లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2015లో విశాఖపట్టణంలో జరిగిన సీపీఎం 21వ మహాసభలో ఆయన పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఎలాంటి గ్రామీణ నేపథ్యం లేకుండా.. హైదరాబాద్‌, ఢిల్లీ వంటి పట్టణ ప్రాంతాల్లో పెరిగిన సీతారాం ఏచూరి పార్టీ జనరల్‌ సెక్రటరీ స్థాయికి ఎదగడం విశేషం.

రాజకీయాలపై చెరగని ముద్ర

సీతారాం ఏచూరి అంటేనే ప్రత్యామ్నాయ రాజకీయాలు గుర్తుకు వచ్చేంతగా ఆయన తనదైన ముద్ర వేశారు. ‘తాపట్టిన కుందేలుకు మూడేకాళ్లు’ అన్న చందంగా మొండిగా కాకుండా.. సమయాన్ని, సందర్భాన్ని బట్టి వ్యవహరించడం, అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నించడం ఆయన పంథా. అందుకే పలుమార్లు ఆయన దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించగలిగారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ నిర్మాణంలో.. దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ ప్రభుత్వాల హయాంలో కీలకంగా వ్యవహరించారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ కనీస ఉమ్మడి కార్యక్రమ రచనలో ఆయన పాలుపంచుకున్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులోనూ ఏచూరి పాత్ర ఉంది. అయితే.. అణు ఒప్పందం విషయంలో కాంగ్రె్‌సతో విభేదాలు రావడంతో సీపీఎం ఆ కూటమి నుంచి వైదొలగింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. ఏచూరి బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి కృషి చేశారు. గత ఏడాది ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమి ఏర్పాటులోనూ తనదైన పాత్రను పోషించారు.


చివరి వీడియో అదే..

కిందటి నెల 22న ఏచూరి ఆస్పత్రి నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష దిగ్గజం, మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్యకు ఆ వీడియోలో నివాళులర్పించారు. ‘‘నేను ఆస్పత్రిలో ఉన్నందున బుద్ధా దా సంస్మరణ సభకు హాజరు కాలేకపోతున్నా. ఆయనకు నివాళులు అర్పించడం నా బాధ్యత. బుద్ధ దాకు నా లాల్‌సలామ్‌ చెబుతున్నా’’ అని ఆ వీడియోలో సీతారాం పేర్కొన్నారు.

రచనలు

సీతారాం ఏచూరి పలు రచనలు చేశారు. సోషలిజం ఇన్‌ చేంజింగ్‌ వరల్డ్‌, మోదీ గవర్నమెంట్‌ న్యూసర్జ్‌ ఆఫ్‌ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్‌ సెక్యులరిజం, క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే తదితర పుస్తకాలు రాశారు. పీపుల్స్‌ డెమాక్రసీ పత్రికలో ఆయన ఎన్నో వ్యాసాలను రాశారు.

ప్రభావవంతమైన స్వరం మూగవోయింది

ఏచూరి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయనవిద్యార్థి నేతగా, పార్లమెంటేరియన్‌గా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన స్వరం వినిపించారు. నిబద్ధత కలిగిన సిద్ధాంతాలతో పనిచేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సమర్థ పార్లమెంటేరియన్‌

ఏచూరి మరణానికి విచారిస్తున్నాను. ఆయన వామపక్ష వాది అయినా.. రాజకీయ ప్రపంచంతో మంచి అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆయన సమర్థమైన పార్లమెంటేరియన్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.

- ప్రధాని నరేంద్ర మోదీ


మంచి స్నేహితుడిని కోల్పోయా

సీతారాం ఏచూరిజీ నాకు మంచి స్నేహితుడు. మన దేశం గురించి లోతైన ఆలోచనలు చేసేవారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.

- రాహుల్‌ గాంధీ

సీపీఎం మూల స్తంభం

సీపీఎంకు ఏచూరి మూలస్తంభం లాంటి వారు. ఆచరణాత్మక ధోరణితో ప్రజల గళాన్ని వినిపించేవారు. ఆయన బహుభాషా గ్రంథకర్త. మంచి పార్లమెంటేరియన్‌. మూడు దశాబ్దాలకు పైగా ఆయనతో మంచి అనుబంధం ఉంది.

- జైరాం రమేశ్‌

వ్యక్తిగతం-రాజకీయాల సమతూకం

వ్యక్తిగత సమీకరణాలను.. అస్థిరమైన రాజకీయ సిద్ధాంతాలతో సమతూకం వేస్తూ.. అద్వితీయ పాత్ర పోషించగల వ్యక్తి సీతారాం ఏచూరి. ఆయన ఓ మేధావి. తన ఆదర్శాలతో ప్రజల పక్షాన నిలిచారు. ఆయన మరణం ఉదారవాద శక్తులకు తీరని లోటు. ఆయనకు ఇదే జోహార్‌.

- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

జాతీయ రాజకీయాలకు తీరని లోటు

ఏచూరి మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటు. ఆయన మరణవార్త తెలిసి బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలుపుతున్నాను.

- మమతాబెనర్జీ, పశ్చిమబెంగాల్‌ సీఎం

వామపక్ష రాజకీయాలకు తీరని లోటు

ఏచూరి మరణం వామపక్ష రాజకీయాలకు తీరని లోటు. ఆయన దోపిడీ రహిత సమాజం కోసం పోరాడేవారు. ఆయనతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. సమకాలీన వామపక్ష ఉద్యమాల్లో ఆయన అత్యంత విశిష్టమైన వ్యక్తి. ఏచూరి భార్య సీమ, కుమార్తె అఖిల, కుమారుడు డాని్‌షకు నా సానుభూతి.

- డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి

అవిశ్రాంత పోరాట యోధుడు

ఏచూరి అవిశ్రాంత పోరాట యోధుడు. అభ్యుదయ భావాలు మెండుగా ఉన్న నిండైనా రాజీకీయవేత్త. నమ్మిన సిద్థాంతాల కోసం రాజీలేని పోరాటం చేసిన యోధుడు. ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేసిన జాతీయ నేత. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి గళం విప్పారు.

- మాజీ సీజేఐ ఎన్వీ రమణ

చాలా బాధకలిగించింది

ఏచూరి మరణ వార్త చాలా దుఃఖాన్ని కలిగించింది. ఏచూరి తనకు ఆత్మీయ సన్నిహితుడు. సీపీఎంలో సైద్థాంతిక బలంతో తర్కబద్దంగా విషయాలను చక్కగా వివరించే మేధావి

- గవర్నర్‌ దత్తాత్రేయ

Updated Date - Sep 13 , 2024 | 05:52 AM

Advertising
Advertising