కేరళ ఆలయంలో బాణసంచా పేలుడు
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:58 AM
కేరళలోని ఓ ఆలయంలో జరిగిన తెయ్యం(కాళియాట్టం) ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.
తొక్కిసలాట.. 150 మందికి గాయాలు
తెయ్యం ఉత్సవాల్లో అపశ్రుతి
ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో పెద్ద ఎత్తున
బాణసంచా నిల్వ.. నిప్పురవ్వలు పడి పేలుళ్లు
కాసర్‌గడ్(కేరళ), అక్టోబరు 29: కేరళలోని ఓ ఆలయంలో జరిగిన తెయ్యం(కాళియాట్టం) ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దేవాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాణసంచా హఠాత్తుగా పేలడంతో తొక్కిసలాట జరిగి సుమారు 154 మంది గాయపడ్డారు. వీళ్లలో 10 మంది తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్నారు. తెయ్యం లేదా కాళియాట్టం అనేది ఉత్తర కేరళ ప్రాంతంలోని ఆలయాల్లో నిర్వహించే పురాతన కళా ప్రదర్శన. అయితే, కాసర్‌గడ్ జిల్లాలోని నీలేశ్వరం పట్టణ సమీపంలోని వీరర్కవు దేవాలయంలో సోమవారం రాత్రి తెయ్యం ఉత్సవం జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ఉత్సవాల కోసం ఆలయ ప్రాంగణంలోని ఓ రేకుల షెడ్డులో పెద్ద ఎత్తున బాణసంచా నిల్వ ఉంచారు. ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు తెయ్యం ప్రదర్శన చూస్తుండగా ఆ పెడ్డులో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దంతో జనం ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనకు సంబంధించి ఆలయ కమిటీకి చెందిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిలో ముగ్గురిని మంగళవారం అరెస్టు చేశారు.
Updated Date - Oct 30 , 2024 | 05:58 AM