Gujarat Floods: వరదల బీభత్సం.. 28 మందికిపైగా మృత్యువాత
ABN, Publish Date - Aug 29 , 2024 | 06:41 AM
గుజరాత్‌ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని(Gujarat Floods) అనేక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
గాంధీనగర్: గుజరాత్‌ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని(Gujarat Floods) అనేక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వరదల ధాటికి 28 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ పాండే వెల్లడించారు. పశ్చిమ ప్రాంతాలపై వర్షాల ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. వడోదరలో 10 నుంచి12 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రెస్క్యూ కొనసాగించడానికి సైన్యం సహకారం కావాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు 40 వేల మంది వరదలతో ప్రభావితమయ్యారని ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశామని అలోక్ కుమార్ చెప్పారు.
ఐఎండీ హెచ్చరికలు..
అయితే, గుజరాత్‌కి వరదల ముప్పు తొలగిపోలేదని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. గురువారం సౌరాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడోదరలో వరుణుడు కాస్త శాంతించినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం ధాటికి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో నివాస ప్రాంతాలు మునిగిపోయాయి.ఆజ్వా ఆనకట్ట ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నీటి నిల్వ 25 అడుగుల గరిష్ఠానికి చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ లోతట్టు ప్రాంతాలను బుధవారం సందర్శించారు. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాం. వడోదరలో1,200 మందికిపైగా రక్షించారు.
మోదీ ఆరా..
వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న వేళ ప్రధాని మోదీ.. సీఎం భూపేంద్ర పటేల్‌కి కాల్ చేశారు. సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని మోదీ తెలిపారు. వడోదరాలో సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి ఐదు అదనపు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)బృందాలు, ఆర్మీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అహ్మదాబాద్, సూరత్ నుంచి రెస్క్యూ బోట్లను వడోదరకు పంపినట్లు అధికారులు తెలిపారు.
For Latest News click here
Updated Date - Aug 29 , 2024 | 06:41 AM