Health Sector : క్యాన్సర్ రోగులకు ఊరట
ABN, Publish Date - Jul 24 , 2024 | 05:49 AM
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం దక్కింది. ఆరోగ్య శాఖకు రూ.90,958.63 కోట్ల నిధులు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.80,517.62 కోట్లతో పోలిస్తే ఇది 12.93ు అధికం కావడం విశేషం. అలాగే క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేలా కీలకమైన మూడు ఔషధాల
న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం దక్కింది. ఆరోగ్య శాఖకు రూ.90,958.63 కోట్ల నిధులు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.80,517.62 కోట్లతో పోలిస్తే ఇది 12.93ు అధికం కావడం విశేషం. అలాగే క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేలా కీలకమైన మూడు ఔషధాల (ట్రాస్టుజుమాబ్ డెరక్స్‌టెకాస్, ఒసిమెర్టినిబ్, డర్వాలుమాబ్)పై కస్టమ్స్ డ్యూటీని 10ు నుంచి సున్నాకు తగ్గించారు. ‘క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేందుకు వీలుగా మూడు రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయిస్తున్నాం. అలాగే ఎక్స్‌రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్‌రే ట్యూబ్‌లు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై కస్టమ్స్ డ్యూటీలో కూడా మార్పులను ప్రతిపాదిస్తున్నాం’ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఆరోగ్య రంగానికి కేటాయించిన రూ.90,958.63 కోట్లలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.87,656.90 కోట్లు, ఆరోగ్య పరిశోధనలకు రూ.3,301.73 కోట్లు కేటాయించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇంకా ఏ ఏ శాఖలకు ఎంతెంత నిధులు కేటాయించారంటే..
ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.3,712.49 కోట్లను కేటాయించారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని పథకాలకు గతంలో ఉన్న రూ.77,624.79 కోట్లను.. ఈ సారి రూ.87,656.90 కోట్లకు పెంచారు.
కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో నేషనల్ హెల్త్ మిషన్‌కు రూ.31,550.87 కోట్లను ఈ ఏడాది రూ.36,000 కోట్లకు పెంచారు.
ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి కూడా కేటాయింపులు రూ.6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెంచారు.
నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ కార్యక్రమానికి రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమానికి రూ.200 కోట్లు.
స్వయం ప్రతిపత్తి సంస్థలకు గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.17,250.90 కోట్లను రూ.18,013.62 కోట్లకు పెంచారు. ఇందులో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రూ.4,523 కోట్లు కేటాయించారు.
Updated Date - Jul 24 , 2024 | 05:49 AM