High Court: పండుగ పూట సమ్మె అవసరమా..? కార్మిక సంఘాలు, ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ABN, Publish Date - Jan 11 , 2024 | 07:54 AM
సంక్రాంతి పండుగ సమయంలో రవాణా కార్మికులు సమ్మె చేపట్టడంపై మద్రాస్ హైకోర్టు(Madras High Court) నిలదీసింది. అదే సమయంలో సమస్యల పరిష్కారం వ్యవహారంలో కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం మంకుపట్టు పట్టడంపై ప్రశ్నించింది.
- దిగొచ్చిన కార్మికులు.. సమ్మె వాయిదా
- 19న కార్మికులతో చర్చలు: ప్రభుత్వం
- సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ 20 నుంచి సమ్మె: సీఐటీయూ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సమయంలో రవాణా కార్మికులు సమ్మె చేపట్టడంపై మద్రాస్ హైకోర్టు(Madras High Court) నిలదీసింది. అదే సమయంలో సమస్యల పరిష్కారం వ్యవహారంలో కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం మంకుపట్టు పట్టడంపై ప్రశ్నించింది. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఇలాంటి చర్యలు భావ్యమేనా అని ఇరువర్గాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు రోజులుగా సమ్మె చేపడుతున్న కార్మిక సంఘాలు ఎట్టకేలకు దిగొచ్చాయి. ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపాయి. అదే సమయంలో ఈనెల 19న కార్మిక సంఘాలతో త్రైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
నిషేధం విధించండి...
రవాణా కార్మికుల సమ్మె పిలుపుపై నిషేధం విధించాలని కోరుతూ షోళింగనల్లూరుకి చెందిన పాల్‌గిద్యోన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ గంగాపూర్‌వాలా, న్యాయమూర్తి జస్టిస్ భరత్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... పండుగ సమయంలో ఈ సమ్మె చేపట్టడమేంటని ప్రశ్నించింది. ‘ఈ సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగుతాయి కదా? రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకునే సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ఎందుకు ఇబ్బందులు కలిగిస్తున్నారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రవాణా కార్మికుల సమ్మెవల్ల నగరాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలుగకపోవచ్చునేమోగాని, గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజానీకం తీవ్రంగా నష్టపోతారని, ఈ వ్యవహారంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మంకుపట్టు పడుతుండటం భావ్యమేనా? అంటూ నిలదీసింది. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెను తాము తప్పుబట్టడం లేదని, అదే సమయంలో అనువుగాని పండుగ సమయంలో ఈ సమ్మె అవసరమా అని ఆ సంఘాలు ఆలోచించాలని సూచించింది. ఈ సమ్మెను నెలాఖరువరకూ వాయిదా వేసే విషయమై కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అదే సమయంలో మాజీ రవాణా కార్మికులకు పింఛన్ బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లించే అవకాశం ఉందోలేదో అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
తాత్కాలికంగా వాయిదా...
ధర్మాసనం ముందు మళ్లీ విచారణ సందర్భంగా కార్మిక సంఘాలు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. అదే విధంగా పింఛన్‌దారుల కరవు భత్యం బకాయిలు చెల్లించే విషయమై ఈనెల 19న ప్రభుత్వం త్రైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఈనెల 19 తర్వాత కార్మిక సంఘాల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని తాము భావిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రెండో రోజు 98 శాతం బస్సులు...
కార్మిక సంఘాల సమ్మె పిలుపుపై స్పందన లేకపోవడంతో రెండో రోజు రవాణా సంస్థల్లో బస్సులు యథావిధిగా నడిచాయి. అన్నాడీఎంకే కార్మిక సంఘం దాని మద్దతు సంఘాలకు చెందిన కార్మికులు మాత్రమే సమ్మెలో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 98 శాతం బస్సులు నడిపినట్లు రవాణా సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. రవాణా శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందుతున్న డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమించి బస్సులను పూర్తిస్థాయిలో నడిపేందుకు అన్ని డిపోల్లో అధికారులు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగని రీతిలో మంగళవారం 95 శాతం బస్సులు, బుధవారం 98 శాతం బస్సులు నడిపినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వంద శాతం ఎక్స్‌ప్రెస్ సర్వీసు బస్సులు నడిపామని, అదే విధంగా విల్లుపురం డిపో పరిధిలో 97.19 శాతం బస్సులు, సేలండిపో పరిధిలో 97,09 శాతం బస్సులు, కుంభకోణం డిపో పరిధిలో 97.47 శాతం బస్సులు, మదురైలో 98.79 శాతం పనులు, తిరునల్వేలిలో 95.51 శాతం బస్సులు నడిచాయి. రాష్ట్రవ్యాప్తంగా 15236 బస్సులకుగాను 14888 బస్సులు నడిచాయి. ఇక చెన్నైలోని ఎంటీసీ బస్సులు పూర్తిస్థాయిలో నడిపేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో 3,233 ఎంటీసీ బస్సులకుగాను 3,177 బస్సులు నడిపినట్లు అధికారులు ప్రకటించారు.
సమ్మెకు దిగిన కార్మికుల వివరాల సేకరణ...
రాష్ట్ర రవాణా సంస్థలలో రెండు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల వివరాలను రవాణా శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఆయా డిపో మేనేజర్ల నుంచి ఈ వివరాలను సేకరించే పనుల్లో ఉన్నారు. 8 డిపోలలో సమ్మె చేస్తున్న కార్మికులకు త్వరలో షోకాజు నోటీసులు జారీ చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు.
Updated Date - Jan 11 , 2024 | 07:54 AM