Himanta sarma: రాహుల్‌ను అరెస్టు చేస్తాం...ఎప్పుడంటే
ABN, Publish Date - Jan 24 , 2024 | 09:05 PM
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అసోంలో దుమారం రేపుతోంది. రాహుల్ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తాజాగా రాహుల్‌ను అరెస్టు చేసి తీరుతామన్నారు.
గౌహతి: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay yatra) అసోంలో దుమారం రేపుతోంది. రాహుల్ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa sarma) తాజాగా రాహుల్‌ను అరెస్టు చేసి తీరుతామన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఆ పని చేస్తామని చెప్పారు.
''ఇప్పుడు మేము చర్య తీసుకుంటే, ఇది రాజకీయ చర్య అని వాళ్లు పేరు పెడతారు'' అని హిమంత్ బిస్వా శర్మ అన్నారు. రాహుల్ గాంధీ తన పర్యటనలో కామాక్షి ఆలయంతో సహా పలు కీలక ఆలయాలను దర్శించకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, వివాదం సృష్టించడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ప్రశాంతంగా ఉండే అసోంలో అలజడి సృష్టించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని, ఇలాంటి వారి ఆటలు సాగనీయమని అన్నారు.
సిట్ ఏర్పాటు చేస్తాం...
''యాత్ర సందర్భంగా అసోంలో జరిగిన ఘటనలపై సిట్ ఏర్పాటు చేస్తాం. సిట్ విచారణ జరుపుతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తాం. ఇప్పుడు చర్య తీసుకుంటే దీన్ని రాజకీయ చర్యగా వాళ్లు మాట్లాడతారు. మాదగ్గర ఆధారాలున్నాయి. గౌహతిలో ఆయన ప్రజలను రెచ్చగొట్టారు'' అంటూ పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశించి శర్మ అన్నారు. దీనికి ముందు తనపై అసోం సర్కార్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై రాహుల్ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని అన్నారు. మరో పాతిక కేసులు నమోదుచేసినా భయపడేది లేదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనను భయపెట్టలేవని తెగేసిచెప్పారు.
Updated Date - Jan 24 , 2024 | 09:46 PM