Robert Vadra: ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 30 , 2024 | 07:54 PM
వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడం అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందని అన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్: వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడం అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందని అన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందని రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. తన భార్య, కూతురు భద్రత విషయంలో అప్పుడప్పుడు ఆందోళనగా అనిపిస్తుందని అన్నారు. ‘‘ భూమిపై నడవాలంటే నా భార్య, కూతురితో సహా దేశంలోని మహిళలు అందరూ భద్రతగా భావించే రోజు రావాలి. మహిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పాలి. రాహుల్ గాంధీ, నేను ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాం. దేశంలోని సమస్యలను నేను, రాహుల్ ఒకే కోణంలో చూస్తున్నాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మరో ఐదేళ్ల తర్వాత ఆ మార్పు ప్రజలు చూస్తారు. నేను ఆధ్యాత్మిక భావనతోనే హైదరాబాద్‌కు వచ్చాను’’ అని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక ఆలయాలను దర్శించుకునేందుకు ఆయన ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారు.
రైతుల ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. ఆమె పార్లమెంట్‌లో ఉండడం సరికాదని అన్నారు. ప్రజా ప్రయోజనాల గురించి ఆమెకు ఏమైనా ఆసక్తి ఉందో లేదో ఆయన ప్రశ్నించారు. మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్న కంగనా రనౌత్ మహిళల గురించి ఆలోచించాలని, భద్రత గురించి పోరాడాలని అన్నారు. కాగా కంగనా రనౌత్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బలమైన నాయకత్వం లేకపోయుంటే.. రైతుల ఉద్యమం దేశంలో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవని అన్నారు.
Updated Date - Aug 30 , 2024 | 07:54 PM