Gyanvapi: జ్ఞానవాపిలో హిందూ దేవతల విగ్రహాలు.. సంచలనంగా మారిన ఏఎస్ఐ రిపోర్టు..
ABN, Publish Date - Jan 26 , 2024 | 04:21 PM
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే విడుదల చేసిన ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే విడుదల చేసిన ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇండియా టుడే కథనం ప్రకారం మసీదు సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు, శిథిలాల ఫొటోలు అక్కడ గుడి ఉండేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆంజనేయ స్వామి, వినాయకుడుతో పాటు శివలింగ పానవట్టం, నంది విగ్రహాలు ఉన్నట్లు గుర్తించాయి. వీటితో పాటు నాణేలు, పర్షియన్ భాషలో చెక్కిన ఇసుకరాయి స్లాబ్, ఒక రోకలిని సైతం ఫొటోల్లో కనిపించాయి. హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి మసీదును నిర్మించారనే విషయాన్ని ఈ ఫొటోలు వెల్లడిస్తున్నాయి.
17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో ఆలయాన్ని కూల్చివేసినట్లు రాతి పలకలపై పర్షియన్ భాషలో శాసనాలు ఉన్నాయి. హిందూ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్‌జైన్ ఈ రిపోర్టును వెల్లడించారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను వినియోగించారు. శిల్పరీతిని బట్టి ఆలయం ఉన్నట్టుగా రుజువవుతోందని ఏఎస్‌ఐ రిపోర్ట్ పేర్కొందని జైన్ వివరించారు. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో ఒక గొప్ప హిందూ దేవాలయం ఉందనే నమ్మకం బలంగా మారుతోంది. కాగా.. శిథిలాలు ఏ సంవత్సరానికి చెందినవి అనే విషయం తెలియాల్సి ఉంది.
Updated Date - Jan 26 , 2024 | 05:13 PM