కర్ణాటకలో ముగ్గురు మంత్రులకు కాంగ్రెస్ నోటీసులు!
ABN, Publish Date - Nov 11 , 2024 | 04:00 AM
రాష్ట్రంలో మంత్రులపై వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు వస్తుండడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బెంగళూరు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంత్రులపై వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు వస్తుండడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు మంత్రులకు నోటీసులు జారీ చేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు.. వక్ఫ్ బోర్డుకు చెందినవంటూ నోటీసులు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం, విజయపురలో నిరవధిక నిరసనకు దిగడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. వక్ఫ్ వివాదానికి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కారణమని బీజేపీ మండిపడుతోంది. ఇక అబ్కారీ శాఖలో ఏటా రూ.వందల కోట్లు లంచాలు అధికారుల ద్వారానే వసూలు చేయిస్తున్నట్టు మంత్రి ఆర్‌బీ తిమ్మాపురపై వారం రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిమ్మాపురకు నోటీసులు అందినట్టు సమాచారం. ఇక బెళగావి జిల్లా తహసీల్దార్ కార్యాలయంలోనే రుద్రణ్ణ యడణ్ణవర్ ఆత్మహత్య చేసుకున్న కేసులో మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్ పీఏ సోమును కీలక నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదవడంతో అతను పరారీలో ఉన్నాడు. ఈ ముగ్గురు మంత్రులపై ఆరోపణలు రావడంపై అధిష్టానం తీవ్రంగా పరిగణించింది.
Updated Date - Nov 11 , 2024 | 04:00 AM