Gurpatwant Pannun: పన్నూన్ హత్యకు కుట్ర.. ఆ మీడియా రిపోర్ట్‌కి భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - Apr 30 , 2024 | 01:44 PM
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రలో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హస్తం ఉందని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ కథనం పూర్తిగా అసమంజసమైనది..
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్రలో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హస్తం ఉందని వాషింగ్టన్ పోస్ట్ (Washington Post) ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ కథనం పూర్తిగా అసమంజసమైనది, నిరాధారమైందని తిప్పికొట్టింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) మాట్లాడుతూ.. ఆ మీడియా కథనం పూర్తిగా నిరాధారమైందన్నారు. క్రిమినల్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు.. భారత ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసిందని, అది సమగ్ర విచారణ జరుపుతోందని చెప్పారు. కానీ.. ఇంతలోనే ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఒరిగేదేమీ లేదని తేల్చి చెప్పారు.
‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’
కాగా.. వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ఆ కథనంలో.. విక్రమ్ యాదవ్ అనే భారత ‘రా’ మాజీ అధికారి పన్నూన్‌ని అమెరికాలో చంపేందుకు ప్రణాళికలు రచించారని, ఇందుకు ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశాడని పేర్కొంది. అయితే.. ఈ హత్యాయత్నాన్ని అమెరికా నిఘా విభాగాలు అడ్డుకున్నాయని తెలిపింది. ‘రా’ ఉన్నతాధికారుల అనుమతితోనే విక్రమ్ ఆ పనికి సిద్ధమయ్యాడని, కాబట్టి ఈ హత్యాయత్నంలో వారి ప్రమేయం కూడా ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నట్లు ఆ పత్రిక రాసుకొచ్చింది. ఈ కుట్ర గురించి ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా తెలుసని, ఇందుకు ఆధారాలు కూడా అమెరికా సంస్థలు గుర్తించాయని చెప్పింది. విదేశాల్లోని తమ శత్రువులను నిర్మూలించేందుకు కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై పరిశోధనల క్రమంలోనే పన్నూన్ హత్యాయత్నం వివరాల్ని, ఆధారాల్ని సేకరించే యత్నం జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఇందుకు కౌంటర్‌గానే రణ్‌ధీర్ జైస్వాల్ పైవిధంగా స్పందించారు.
Read Latest National News and Telugu News
Updated Date - Apr 30 , 2024 | 01:44 PM