ISRO: హ్యాట్రిక్ కొట్టిన ఇస్రో.. విజయవంతమైన ``పుష్పక్`` మూడో ప్రయోగం!
ABN, Publish Date - Jun 23 , 2024 | 01:44 PM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు ముందుకేసింది. రీ-యూజబుల్ లాంఛ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్‌పరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగాన్ని మూడోసారి విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు ముందుకేసింది. రీ-యూజబుల్ లాంఛ్ వెహికల్ ల్యాండింగ్ (Reusable Launch Vehicle -RLV) ఎక్స్‌పరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగాన్ని మూడోసారి విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మూడో ప్రయోగాన్ని మరింత కఠినతమైన వాతావరణ పరిస్థితుల మధ్య నిర్వహించి సక్సెస్ అయింది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడి భాగాలు, వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ ఆర్‌ఎల్‌వీ ఎల్ఈఎక్స్ (RLV LEX) ప్రయోగాలను చేపడుతోంది.
అంతరిక్షం నుంచి వచ్చే వాహకనౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా స్పష్టంగా తెలుసుకున్నట్టు ఇస్రో పేర్కొంది. ఆర్‌ఎల్‌వీల అభివృద్ధికి అవసరమైన కీలకమైన టెక్నాలజినీ పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం బయటపెట్టింది. ఈ ప్రయోగాన్ని ఈ రోజు (ఆదివారం) ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR)లో నిర్వహించారు. ఇంతకుముందు నిర్వహించిన ఆర్‌ఎల్‌వీ ఎల్ఈఎక్స్-1, ఆర్‌ఎల్‌వీ ఎల్ఈఎక్స్-2 ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో ఈ మూడో ప్రయోగాన్ని తీవ్రమైన గాలి, కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య నిర్వహించారు.
ఈ ఆర్‌ఎల్‌వీ ఎల్ఈఎక్స్ సిరీస్ ప్రయోగాల్లో ఇదే చివరిది. ఈ ప్రయోగంలో భాగంగా ``పుష్పక్`` (Pushpak) అనే పిలిచే రీ-యూజబుల్ లాంఛ్ వెహికల్‌ను చినూక్ హెలికాఫ్టర్ ద్వారా తీసుకెళ్లి రన్ వేకు నాలుగు కిలోమీటర్ల దూరంలో, 4.5 కిలోమీటర్ల ఎత్తులో జారవిడిచారు. అక్కడి నుంచి పుష్పక్ స్వయంగా క్రాస్-రేంజ్ కదలికలను నియంత్రించుకుంటూ రన్ వే పైకి వచ్చి సెంటర్‌లైన్ వద్ద సమాంతరంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో పుష్పక్ వేగం గంటకు 320 కిలోమీటర్లు. ల్యాండ్ అయిన తర్వాత బ్రేక్ పారాచ్యూట్ సహాయంతో వేగాన్ని తగ్గించుకుంది.
Updated Date - Jun 23 , 2024 | 01:44 PM