ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CJI : సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

ABN, Publish Date - Oct 18 , 2024 | 06:10 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన వారసుడి పేరును ప్రకటించారు. తదుపరి చీఫ్‌ జస్టి్‌సగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును ఆయన సిఫారసు చేశారు. వచ్చేనెల 10వ తేదీన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం ముగియనుంది. దిగిపోయే ముందు సుప్రీంకోర్టులోని సీనియర్‌ న్యాయమూర్తి

సిఫారసు చేసిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన వారసుడి పేరును ప్రకటించారు. తదుపరి చీఫ్‌ జస్టి్‌సగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును ఆయన సిఫారసు చేశారు. వచ్చేనెల 10వ తేదీన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం ముగియనుంది. దిగిపోయే ముందు సుప్రీంకోర్టులోని సీనియర్‌ న్యాయమూర్తి పేరును చీఫ్‌ జస్టిస్‌ పదవికి సిఫారసు చేయడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని అనుసరించి బుధవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయశాఖకు జస్టిస్‌ చంద్రచూడ్‌ లేఖ రాశారు. అనంతరం.. కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలనకు పంపుతుంది. ప్రధాని ఆమోదం తర్వాత రాష్ట్రపతి సిఫారసుకు పంపుతారు. చివరిగా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వం స్థాయిలో లాంఛనాలు సజావుగా పూర్తయితే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబరు 11వ తేదీన బాధ్యతలు తీసుకుంటారు. ఆరు నెలలకు అటుఇటుగా, అంటే వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ తర్వాత సీనియారిటీలో రెండోస్థానంలో ఉన్న ఆయన.. ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, జస్టిస్‌ చంద్రచూడ్‌ 2022 నవంబరు తొమ్మిదిన సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ నుంచి బాధ్యతలు స్వీకరించారు.


ఎవరీ ఖన్నా?

ఎమర్జెన్సీ కాలంలో గుర్తుండే అనేక తీర్పులు రాసిన సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా మేనల్లుడే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా. రాజ్యాంగానికి ఎన్ని సవరణలు ప్రతిపాదించినా, దాని మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చడానికి వీల్లేదంటూ 1973లో కేశవానంద భారతీ కేసులో చరిత్రాత్మక తీర్పును ఇచ్చిన న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయన ఒకరు. ఎమర్జెన్సీ అమలులో ఉండగా, అన్ని హక్కులతోపాటు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా రద్దయి పోతాయంటూ.. ఏడీఎమ్‌ జబల్‌పూర్‌ కేసులో సుప్రీంకోర్టు 1976లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రాసిన ధర్మాసనంలోని మెజారిటీ జడ్జీలతో విభేదించి, వేరుగా తీర్పు రాసిన ఒకే ఒక న్యాయమూర్తి జస్టిస్‌ ఖన్నా. దీంతో సీనియారిటీ రీత్యా చీఫ్‌జస్టిస్‌ కావాల్సిన ఆయనను, ఆ పదవి చేపట్టకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. దీనికి నిరసనగా ఆయన సర్వీసు ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. జస్టిస్‌ ఖన్నాకు అలా ఆనాడు చేజారిన ఆ పదవిని ఆయన బంధువు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా త్వరలో చేపడుతుండటం విశేషం. ఆయన తండ్రి జస్టిస్‌ దేవ్‌రాజ్‌ ఖన్నా కూడా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించడం మరో విశేషం. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తన మేనమామ జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా పనిచేసిన అదే కోర్టు గది నుంచి తన మొదటి రోజును జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రారంభించారు. ఆయన 1960 మే 14వ తేదీన జన్మించారు. ఢిల్లీలోని బరాఖంబా రోడ్‌లోని మోడరన్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశాడు. ఢిల్లీ యూనివర్సిటీలోని లా సెంటరు క్యాంప్‌సలో 1980లో చదువు పూర్తి చేసుకున్నారు. తన పేరును 1983లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. తీస్‌ హజారీ కాంప్లెక్స్‌ జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునల్స్‌లో రాజ్యాంగ, ప్రత్యక్ష పన్నులు, మధ్యవర్తిత్వం వంటి విభిన్న రంగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. అలాగే.. కమర్షియల్‌ లా, కంపెనీ లా, ల్యాండ్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా వంటి రంగాల్లో ప్రాక్టీ్‌సతో పాటు ఆదాయపు పన్ను శాఖకు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. 2004లో ఢిల్లీ ప్రభుత్వంలో నేషనల్‌ కేపిటల్‌ టెర్రిటరీకి స్టాండింగ్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో అనేక క్రిమినల్‌ కేసుల్లో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, అమికస్‌ క్యూరీగా పనిచేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయి, ఏడాది తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019 జనవరి 18న నియమితులయ్యారు.

ఈవీఎంలపై కీలక తీర్పు..

ఎన్నికల నిర్వహణకు వాడుతున్న ఈవీఎంలపై తలెత్తిన భయసందేహాలను తొలగిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కీలక తీర్పును వెలువరించారు. ‘ఈవీఎం యంత్రాలు చెల్లుతాయి. అవి భద్రమే’నని తేల్చి చెప్పారు. పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించడం, బోగస్‌ ఓటింగ్‌కు పాల్పడటం వంటి చర్యలు ఈవీఎంల రాకతో ఆగాయని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల బాండ్ల అంశంపై తీర్పును ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా ఒకరు. బాండ్ల జారీని రాజ్యాంగ విరుద్ధంగా అప్పట్లో బెంచ్‌ తేల్చేసింది. అలాగే, జమ్మూకశ్మీర్‌కు ఉద్దేశించిన అధికరణం 370ను రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు రాసిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కూడా ఉన్నారు. అయితే.. ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మాత్రం తన తీర్పును సొంతంగా చెప్పారు. సీజేఐ చంద్రచూడ్‌, జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ కలిసి ఒక తీర్పు వెలువరించగా.. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మరో రెండు తీర్పులను వెలువరించారు. జమ్మూకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనల అంశాన్ని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తన తీర్పులో ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్టు అయిన అప్పటి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మంజూరు చేశారు.

Updated Date - Oct 18 , 2024 | 06:10 AM