కర్ణాటకపై కమలం భారీ ఆశలు
ABN, Publish Date - Apr 03 , 2024 | 03:31 AM
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ దక్షిణాదిలో కర్ణాటకపై భారీగా ఆశలు పెట్టుకుంది. 2019లో రాష్ట్రంలో సాధించిన ఘన విజయాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
మోదీ మేనియా, రామ మందిరం రక్షణ కవచాలంటున్న కాషాయ దళం
28 స్థానాలూ దక్కించుకునే ప్లాన్
జేడీఎ్‌సతో చేతులు కలిపిన బీజేపీ
సిద్దూ సర్కార్ గ్యారెంటీలతో పుంజుకున్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ దక్షిణాదిలో కర్ణాటకపై భారీగా ఆశలు పెట్టుకుంది. 2019లో రాష్ట్రంలో సాధించిన ఘన విజయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. గత 2019లో ఆయా దక్షిణాది రాష్ట్రాల్లో 30 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటిలో 25 ఒక్క కర్ణాటకలోనే దక్కించుకున్నారు. దక్షిణాదిలో బలంగా ఉన్నామని చెప్పుకొనే కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ అధిక సంఖ్యలో సీట్లు కైవసం చేసుకుని ఆ పార్టీకి సవాల్ రువ్వింది. ఈ రాష్ట్రంలో 2004 నుంచి 2019 వరకు గడిచిన నాలుగు ఎన్నికల్లోనూ బీజేపీ గణనీయ సంఖ్యలో లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే కర్ణాటకలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎ్‌సతో పొత్తు పెట్టుకుంది. తద్వారా ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం పార్లమెంటు స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
గత వికాసం ఇదీ!
2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 25 స్థానాల్లో విజయం దక్కించుకోగా, కాంగ్రెస్, జేడీఎ్‌సలు ఒక్కో స్థానంలో మాత్రమే గెలిచాయి. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 51.4 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. కాగా, గతేడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ ఎ్‌సకు ఘోర పరాభవం ఎదురైంది. పైగా ఈ పార్టీకి చెందిన 5ు ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎ్‌సతో పొత్తులో భాగంగా 25 స్థానాల్లో పోటీ చేయాలని కమలనాథులు నిర్ణయించారు. మిత్రపక్షం జేడీఎస్.. కోలార్, హస్సన్, మాండ్య.. మూడు స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఇక, బీజేపీ ఒక్క చిత్రదుర్గ మినహా 24 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఈ స్థానాల్లో 12 మంది సిట్టింగులకు టికెట్లను నిరాకరించింది. దీంతో టికెట్లు రాని వాళ్లు బీజేపీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, జేడీఎస్ నేతలు కూడా బీజేపీతో పొత్తు వ్యవహారంపై అంతర్గతంగా మథన పడుతున్నారు. సీట్ల పంపకాలను ఆలస్యం చేయడంతోపాటు, జేడీఎ్‌సకు కంచుకోట వంటి మాండ్య నియోజకవర్గాన్ని నటి సుమలతా అంబరీ్‌షకు కేటాయించాలన్న బీజేపీ ప్రతిపాదనపై కూడా కుమారస్వామి వర్గం గుర్రుగా ఉంది.
కాంగ్రెస్ గ్యారెంటీల ప్రభావం!
కర్ణాటకలో గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు గ్యారెంటీల హామీలను అమలు చేస్తోంది. ఇది కూడా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, పేదలకు ఉచిత బియ్యం వంటివి ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లేలా చేస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో ఆయా పథకాలకు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం రూ.50 వేల కోట్ల రూపాయలను కేటాయించడం గమనార్హం.
మోదీ మేనియా కలసివచ్చేనా?
ప్రధాని మోదీ మేనియా, అయోధ్య రామ మందిరం వంటి కీలక అంశాలపై కర్ణాటక బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు అంశాలు తమకు కలిసి వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మోదీ ప్రజాదరణ కారణంగానే తమ ఓటు బ్యాంకు 51.4 శాతానికి చేరుకుందని నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇది 53 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
మైనారిటీలు కాంగ్రెస్ వైపే!
కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్ వైపే ఉన్నట్టు స్పష్టమవుతోంది. దీనికి ప్రధాన కారణం.. బీజేపీ అంటే లింగాయతుల పార్టీ అని, అగ్రవర్ణ పార్టీ అనే వాదన ఆయా వర్గాల్లో గూడుకట్టుకుపోవడమే. ఇక, బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకున్న తర్వాత బలమైన రెండు సామాజిక వర్గాల(వక్కలిగ, లింగాయతులు) ఓట్లు కుమార స్వామికి ఏమేరకు అందివస్తాయనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇక, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే పడతాయనే అంచనా పెరుగుతోంది.
నేతల మధ్య సఖ్యత ప్రశ్నే!
బీజేపీ-జేడీఎ్‌సలు చేతులు కలిపినా.. గత విషయాలను గుర్తు చేసుకుని ఇరు పక్షాల నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి జేడీఎ్‌సతో బీజేపీ చేతులు కలపడం వెనుక.. దక్షిణ కర్ణాటక, లేదా పాత మైసూరు ప్రాంతాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న వక్కలిగలు తమవైపు మళ్లుతారనే ఆశ ఉంది. కానీ, నేతల మధ్య సఖ్యత కనిపించకపోవడం లేదు.
Updated Date - Apr 03 , 2024 | 03:31 AM