Kamalnath: 15 మందికి పైగా ఎమ్మెల్యేలు కమల్‌నాథ్ వెంటే...
ABN, Publish Date - Feb 18 , 2024 | 04:02 PM
రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు నకుల్ నాథ్ బీజేపీ తీర్థం తీసుకోనుండటం దాదాపు ఖాయమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో వీరిరువురూ కమలం పార్టీలో సోమవారంనాడు చేరనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపుతిరగన్నాయి. రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal nath), ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు నకుల్ నాథ్ (Nakul Nath) బీజేపీ (BJP) తీర్థం తీసుకోనుండటం దాదాపు ఖాయమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో వీరిరువురూ కమలం పార్టీలో సోమవారంనాడు చేరనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కమల్‌నాథ్‌తో పాటు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు మేయర్లు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. తండ్రీకొడుకులిద్దరికీ వారికి కంచుకోటుగా ఉన్న ఛింద్వారాలో ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ భారీ ఈవెంట్‌ను నిర్వహించనుంది.
మోదీ, షా, నడ్డాలతో సమావేశం
ఢిల్లీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కమల్ నాథ్, నకుల్‌నాథ్‌లు ఆదివారం రాత్రి సమావేశం కానున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిరాకరించడం కమల్‌నాథ్ అసంతృప్తికి కారణమని చెబుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కమల్‌నాథ్ రాజీనామా చేశారు. అప్పట్నించి ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఇదే తగిన తరుణంగా బీజేపీలో చేరాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారని అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాల్లో ఒక్క ఛింద్వారా మినహా 28 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
Updated Date - Feb 18 , 2024 | 04:04 PM