అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా
ABN, Publish Date - Nov 22 , 2024 | 06:33 AM
అమెరికా ఆరోపణల నేపథ్యంలో.. గౌతమ్ అదానీతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లుగా కెన్యా ప్రకటించింది. ‘అదానీ అవినీతికి
అవినీతిపై పక్కా సమాచారంతోనే ఈ నిర్ణయం
అదానీ చేజారిన 30 ఏళ్ల ఎయిర్‌పోర్టు నిర్వహణ, 6,220 కోట్ల విద్యుత్ డీల్ ్ఙ
నైరోబీ, నవంబరు 21: అమెరికా ఆరోపణల నేపథ్యంలో.. గౌతమ్ అదానీతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లుగా కెన్యా ప్రకటించింది. ‘అదానీ అవినీతికి సంబంధించి దేశంలోని దర్యాప్తు సంస్థలు, భాగస్వామ్య దేశాలు అందించిన కొత్త సమాచారం ఆధారంగా.. అదానీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయించాం’ అని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం తమ పార్లమెంటు సంయుక్త సమావేశంలో వెల్లడించారు. అయితే, ఆయన తన ప్రకటనలో అమెరికా ప్రస్తావన చేయలేదు. అవినీతి జరిగినట్లుగా తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ మేరకు దేశ రాజధాని నైరోబీలో ‘జోమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయం’ (జేకేఐఏ) విస్తరణకు సంబంధించి కొనసాగుతున్న సేకరణ ప్రక్రియలను తక్షణం రద్దు చేయాలని రవాణా, ఇంధనం, పెట్రోలియం మంత్రిత్వశాఖలను ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు, ఇటీవలే అదానీ గ్రూపుతో కెన్యా విద్యుత్ పంపిణీ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇవి కీలకమైన ప్రాజెక్టులు కాబట్టి, వాటి అమలుకు వీలైనంత త్వరలో వేరే భాగస్వాములను ఎంపిక చేసుకోవాలని ఆయా శాఖలను ఆదేశించినట్లు వెల్లడించారు. రూటో ఈ ప్రకటన చేయగానే.. పార్లమెంటు సభ్యులు కుర్చీల్లోంచి లేచి నిలబడి కొద్దిసేపు కరతాళ ధ్వనులు చేశారు. ఇద్దరు ఎంపీలైతే డ్యాన్స్ చేయటం లైవ్ దృశ్యాల్లో కనిపించింది.
ఇవీ ఆ కాంట్రాక్టులు!
జేకేఐఏ విస్తరణ పనుల కాంట్రాక్టును అదానీ గ్రూపు గతంలో దక్కించుకుంది. దీంట్లో భాగంగా ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ, కొత్త టెర్మినళ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. వీటికిగాను ఆ ఎయిర్‌పోర్టు నిర్వహణను అదానీ కంపెనీకి 30 ఏళ్లపాటు లీజుకిస్తారు. అయితే, అదానీతో ఒప్పందాన్ని ఎయిర్‌పోర్టు సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, కెన్యా ట్రాన్స్‌కోతో 73.6 కోట్ల డాలర్ల (రూ.6,220 కోట్ల) విలువైన విద్యుత్ లైన్ల నిర్మాణం కాంట్రాక్టును కూడా అదానీ సంస్థ గత నెలలో దక్కించుకుంది. కెన్యా అధ్యక్షుడి తాజా ప్రకటనతో.. ఈ రెండు భారీ ప్రాజెక్టులనూ అదానీ కోల్పోయినట్లు స్పష్టమైంది.
హిండెన్‌బర్గ్ నివేదికతో ఏం జరిగింది?
న్యూఢిల్లీ, నవంబరు 21: గౌతమ్ అదానీ కంపెనీలు కాంట్రాక్టులు సంపాదించుకోవడానికి లంచాలు ఇచ్చాయంటూ ఎఫ్‌బీఐ ఆరోపించడంతో గురువారం స్టాక్ మార్కెట్లు ఘోరంగా పడ్డాయి. అదానీ కంపెనీలు తొలిరోజే ఏకంగా 20 శాతం నష్టపోయాయి. రెండు లక్షల కోట్లకు పైగా విలువ కోల్పోయాయి. ఇంతతీవ్రంగా కాకపోయినా 2023 జనవరి 25న హిడెన్‌బర్గ్ నివేదిక వెలువడినపుడు కూడా ఇలాగే మార్కెట్లు పడ్డాయి. రెండు రోజుల్లో 3.86 లక్షల కోట్లు నష్టపోయాయి. ఇప్పుడు మార్కెట్ పతనానికి లంచాల ఆరోపణలు కారణం కాగా, హిండెన్‌బర్గ్ నివేదికలో కృత్రిమంగా షేర్ల ధరలను పెంచారన్న ఆరోపణలు నాటి పతనానికి కారణమయ్యాయి. అదానీ గ్రూపు సంస్థలు దశాబ్దాలుగా అకౌంటింగ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కంపెనీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని పేర్కొంది. అదానీతో లింక్ ఉన్న కంపెనీలు విదేశాల నుంచి కంపెనీ షేర్లను కొనుగోలు చేశాయని ఆరోపించింది. అదానీ సోదరుడు వినోద్ అదానీ వీటిని నిర్వహించాడని బయట పెట్టింది. వీటిని ఎక్కడా అధికారికంగా బయట పెట్టలేదని ప్రస్తావించింది. మారిషస్ నుంచి అదానీ గ్రూప్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన కంపెనీలు చాలా వరకు ఆ కుటుంబంతో సంబంధం ఉన్నవేనని ఆరోపించింది. దాదాపు 570 చిన్నా చితకా కంపెనీలు అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాయని లెక్క తేల్చింది. హిండెన్‌బర్గ్ నివేదిక భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. అదానీ కంపెనీలు కొద్ది వారాల వ్యవధిలో ఏకంగా 50 శాతం పడిపోయాయి. ప్రపంచ అత్యంత ధనవంతుల్లో ఒకరుగా ఉన్న అదానీ భారతీయ ధనవంతుల జాబితాలోనే ఎక్కడికో జారిపోయారు.
Updated Date - Nov 22 , 2024 | 06:33 AM