యువకుడి కడుపులో కత్తి, నెయిల్ కట్టర్, కీచెయిన్...
ABN, Publish Date - Aug 27 , 2024 | 06:06 AM
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బిహార్‌కి చెందిన ఓ యువకుడు... కొన్నాళ్లుగా లోహ వస్తువులను మింగటం అలవాటు చేసుకున్నాడు. తీరా తీవ్ర కడుపునొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరడంతో... అతని కడుపులో ఓ కత్తి, నెయిల్ కట్టర్లు, తాళం చెవులు
సర్జరీ చేసి బయటికి తీసిన బిహార్ వైద్యులు
మోతిహరి, బిహార్, ఆగస్టు 26: మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బిహార్‌కి చెందిన ఓ యువకుడు... కొన్నాళ్లుగా లోహ వస్తువులను మింగటం అలవాటు చేసుకున్నాడు. తీరా తీవ్ర కడుపునొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరడంతో... అతని కడుపులో ఓ కత్తి, నెయిల్ కట్టర్లు, తాళం చెవులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు సర్జరి చేసి వాటిని బయటికి తీశారు. ఈ ఘటన బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది. కొన్ని రోజుల క్రితం 22 ఏళ్ల యువకుడు తీవ్రమైన కడుపు నొప్పితో మోతిహరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఎక్స్‌రే తీసిన వైద్యులు అతని కడుపులో పలు లోహ వస్తువులున్నట్లు గుర్తించారు. దీంతో ఆదివారం సర్జరీ చేసి వాటిని తొలగించారు. ‘‘ ఎక్స్‌రే రిపోర్టు ద్వారా అతని కడుపులో వస్తువులున్నట్లు తెలిసింది. ముందుగా ఒక కీచెయిన్ రింగ్‌ను తీసేశాం. తర్వాత రెండు తాళంచెవులు బయటపడ్డాయి. ఆ తర్వాత నాలుగు అంగుళాల పొడవున్న కత్తి, రెండు నెయిల్ కట్టర్లు వెలికితీశా’’మని ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన డాక్టర్ అమిత్ కుమార్ వివరించారు. యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, దానికి సంబంధించిన చికిత్సను తీసుకుంటున్నాడని వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Updated Date - Aug 27 , 2024 | 06:06 AM