UP: 11 మంది ముస్లిం నేతలపై ఒకే ఒక హిందువు పోటీ.. ఏకంగా 98 వేల ఓట్ల ఆధిక్యం
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:06 PM
యూపీలోని కుందర్కి ఉప ఎన్నిక ఫలితాల్లో ఒకే ఒక హిందూ అభ్యర్థి 11 మంది ముస్లిం అభ్యర్థులపై పైచేయి సాధిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొత్తం 32 రౌండ్లలో 19 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ రామ్‌వీర్ రామ్‌వీర్ ముందంజలో నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆ నియోజకవర్గంలో ముస్లింల జనాభా ఏకంగా 60 శాతం. పోటీలో నిలిచిన ఒక హిందూ నేత మినహా అంతా ముస్లిం అభ్యర్థులే. అలాంటి చోట హిందూ అభ్యర్థి ఏకంగా 98 వేల ఓట్ల మెజారిటీతో దూసుకెళుతున్నారు. బీజేపీకి చారిత్రక విజయం అందించే దిశగా కదనుతొక్కుతున్నారు. యూపీలోని కుందర్కి నియోజకవర్గంలో ఈ అసాధారణ దృశ్యం సాక్షాత్కారమైంది. అసాధారణ విజయం దిశగా అడుగులేస్తున్న ఆ నేత పేరు రామ్‌వీర్ ఠాకూర్ (Uttarpradesh).
UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఉతర్‌ప్రదేశ్‌లోని కుందర్కి నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాల ట్రెండ్ ఆసక్తికరంగా మారింది. కుందర్కికి సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పేరుంది. సంభల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఈ అసెంబ్లీ స్థానంలో మెజారిటీ ఓటర్లు ముస్లింలే. గత ముప్ఫై ఏళ్లుగా అక్కడ బీజేపీ నేత ఎవరూ గెలిచింది లేదు. మరోవైపు, బరిలో దిగిన వారిలో రామ్‌వీర్ మినహా మిగతా వారు ముస్లిం నేతలు. ఇక ఇండియా కూటమి సభ్యపార్టీ ఎస్పీ బీజేపీకి పోటీగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మొహమ్మద్ రిజ్వాన్‌ను బరిలోకి దించింది. 2002 ఎన్నికల్లో రిజ్వాన్ తొలిసారిగా కుందర్కిలో గెలుపొందారు. కానీ, 2007 ఎన్నికల్లో బీఎస్పీ నేత అక్బర్ హస్సేన్ చేతిలో పరాజయం చవిచూశారు. ఆ తరువాత 2012, 2017 ఎన్నికల్లో వరుస విజయాలతో తన సత్తా చాటారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, ఒకే ఒక హిందువుగా బరిలోకి దిగిన రామ్‌వీర్ ఆధిపత్యంలో కొనసాగడం ఆసక్తికరంగా మారింది. ఇది ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు భారీ ఎదురుదెబ్బ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Jharkhand Assembly Results: హేమంత్ సోరెన్‌కే మళ్లీ సీఎం పీఠం.. బీజేపీ ఆశలకు 'ఇండియా' కూటమి గండి
రామ్‌వీర్ ఆధిపత్యానికి కారణాలు..
తాజా సమాచారం ప్రకారం, కుందర్కిలో 32 రౌండ్ల కౌంటింగ్ ఉండగా 19 రౌండ్లు పూర్తయ్యేసరికి రామ్‌వీర్ ఆధిక్యంలో నిలిచారు. విజయం దిశగా ఆయన అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థి వెనకబడటానికి పలు కారణాలు రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ముస్లిం ఒట్ల చీలిక బీజేపీకి లాభించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, స్థానిక ఎస్పీ నేతల మధ్య వర్గ విభేదాలు ఎస్పీని ఓటమి దిశగా నడిపిస్తుండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఉపఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైన సెగ్మెంట్‌గా కుందర్కి నిలవడంతో ఫలితాల సరళి మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ నియోజకవర్గంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని పదే పదే చెప్పుకొచ్చారు. మరోవైపు, ముస్లిం ఓటర్ల అభిమానం చూరగొనేందుకు రామ్‌వీర్ కూడా తీవ్రంగా శ్రమించారు. ఆయన తరఫున బీజేపీకి చెందిన పలువురు ముస్లిం నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. పోలింగ్ రోజున అవకతవకలు జరిగాయంటూ మీడియాలో పలు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ పోలీసులు చట్టవ్యతిరేకంగా ఓటర్ల ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు చెక్ చేస్తున్నారని ఆరపించారు. కొందరిని ఓటేయకుండా అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కుందర్కిలో రీపోలింగ్ జరపాలని ఎస్పీ అభ్యర్థి మహమ్మద్ రిజ్వాన్ డిమాండ్ చేశారు. మైనారిటీ ఓటర్లను ఓటేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ.. ఇద్దరు ఎస్పీలు సహా ఏడుగురు పోలీసులను ఓటర్ మార్గదర్శకాలు ఉల్లంఘించిన ఆరోపణలపై సస్పెండ్ చేసింది. పోలింగ్ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Updated Date - Nov 23 , 2024 | 04:21 PM