Kerala: కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు
ABN, Publish Date - Oct 29 , 2024 | 09:44 AM
సోమవారం అర్ధరాత్రి కేరళలో భారీ బాణా సంచా ప్రమాదం జరిగింది. కాసర్‌గోడ్ జిల్లాలో తెయ్యం ఉత్సవాల ప్రారంభ వేడుకల సందర్భంగా అంజోతంబలం వీరేకావులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 150 మందికిపైగా గాయపడ్డారు. 8 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తిరువనంతపురం: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో భారీ బాణాసంచా ప్రమాదం జరిగింది. ఓ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి బాణాసంచా కాల్చుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా150 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. టపాసులు పేలుతున్న సమయంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలతో పాటు పొగ ఆవరించడంతో అప్పటిదాకా చుట్టూ నిలబడి చూసినవారంతా ఒక్కసారి దూరంగా పరిగెత్తారు. దీంతో తొక్కిసలాట తరహా పరిస్థితి కనిపించింది.
తెయ్యం ఉత్సవాల ప్రారంభ వేడుకల సందర్భంగా అంజోతంబలం వీరేకావులో ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి సమయంలో టపాసుల వేడుక జరిగిందని, అయితే క్రాకర్లలో ఒకటి సమీపంలోని మరిన్ని టపాసులు నిల్వ చేసిన షెడ్‌లో పడి ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. షెడ్‌లో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించడంతో జనాలు భయానికి గురై పరుగులు పెట్టినట్టు దృశ్యాలను బట్టి అర్థమవుతోంది.
కాగా మంటలు ఎగసిపడిన షెడ్ పక్కనే చాలా మంది ఉన్నారని, అందుకే ఒక్కసారిగా పరుగులు తీశారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పెద్ద పేలుడు తర్వాత ఈ మంటలు వ్యాపించాయని, నిప్పు రవ్వలు దూసుకురావడం చూశామని, అందుకే జనాలు భయాందోళనలకు గురయ్యారని పేర్కొన్నారు. కాగా గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఆలయానికి సంబంధించిన శ్రీరాగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. పేలుడు శబ్దం విన్న తర్వాత పరుగులు తీస్తున్న జనాలను అదుపు ప్రయత్నించానని, కానీ రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండడంతో సాధ్యపడలేదని పేర్కొన్నాడు. పండుగ రెండవ రోజున తమ అంచనా కంటే ఎక్కువ మంది వచ్చారని, సోమవారం రాత్రి అసాధారణ రద్దీ నెలకొందని అతడు పేర్కొన్నాడు. షెడ్‌లో చైనీస్ టపాసులు భద్రపరిచారని, ఉత్సవాల్లో కాల్చిన ఒక క్రాకర్ వచ్చి షెడ్‌లో పడి ఉండవచ్చని అన్నారు. కాగా పంచాయతీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ భారీగా క్రాకర్లు పేల్చలేదు. అయితే షెడ్‌కు, క్రాకర్లు పేలిన ప్రదేశానికి మధ్య దూరం విషయంలో ముందే జాగ్రత్త తీసుకొని ఉండాల్సిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాక్..
24 ఏళ్లలో తొలిసారి.. టీమిండియాకు చెత్త రికార్డు ముప్పు
ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే
For more Viral News and Telugu News
Updated Date - Oct 29 , 2024 | 11:09 AM