సెబీ చీఫ్, అదానీపై.. 22న దేశవ్యాప్త ఉద్యమం
ABN, Publish Date - Aug 14 , 2024 | 05:22 AM
అదానీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన దరిమిలా.. సెబీ చీఫ్ మాధురి పురీ బుచ్ రాజీనామా చేయాలని.. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున
ఈడీ కార్యాలయాల ఘెరావ్.. షేర్‌మార్కెట్ స్కాంలో మోదీ పాత్ర: కాంగ్రెస్
కులగణనపైనా విస్తృతంగా ప్రజల్లోకి
పీసీసీ, ఏఐసీసీ నేతలతో ఖర్గే భేటీ
అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చ
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అదానీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన దరిమిలా.. సెబీ చీఫ్ మాధురి పురీ బుచ్ రాజీనామా చేయాలని.. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారమిక్కడ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జులతో సమావేశమయ్యారు. అగ్ర నేత రాహుల్‌గాంధీ సహా 56 మంది నేతలు హాజరయ్యారు. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఆ సందర్భంగా దేశవ్యాప్త ఉద్యమానికి నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్వహించాలన్న అంశంపై కూడా ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఆర్థిక, సామాజిక రాజకీయ న్యాయానికి సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణలను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ‘దేశంలో జరుగుతున్న అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విస్తృతంగా చర్చించాం. అదానీ, సెబీ సంబంధాలపై హిండెన్‌బర్గ్ నివేదికలో వెల్లడించిన అంశాలపై చర్చలు జరిపాం. ఫైనాన్షియల్ మార్కెట్‌ను నియంత్రించాల్సిన సెబీయే రాజీపడింది. ఈ కుంభకోణలో ప్రధానమంత్రి పాత్ర పూర్తిగా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఉద్యమించడంలో భాగంగా రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఘెరావ్ చేస్తారు. సెబీ చైర్‌పర్సన్‌ను తొలగించాలి. విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి వీల్లేదు. జేపీసీ ద్వారా ఈ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వివరించారు. కులగణన, రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ అంశాలపై ఉద్యమ కార్యాచరణను త్వరలో నిర్ణయిస్తామని.. జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తృత స్థాయిలో జనంలోకి వెళ్తామని అన్నారు. వయనాడ్ ఉత్పాతాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని సమావేశం డిమాండ్ చేసిందన్నారు. వయనాడ్ మృతులకు సంతాపం తెలిపిందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, పూజాస్థలాలపై దాడులు జరగకుండా నిలిపివేసేందుకు మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీరుల్లో ఎన్నికల సన్నద్ధతపై చర్చించామని, అవసరమైన చోట్ల పొత్తులు పెట్టుకుంటామని వేణుగోపాల్ చెప్పారు.
సెబీ చీఫ్ రాజీనామా కోరాలి: ఖర్గే
‘సెబీకి, అదానీకి మధ్య సంబంధాలపై దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్లో చిన్న మదుపరుల డబ్బును గందరగోళంలో పడేయకూడదు. మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్ రాజీనామాను కోరాలి. దీనిపై జేపీసీని ఏర్పాటుచేయాలి’ అని ఖర్గే ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. నిరుద్యోగం, హద్దుల్లేని ద్రవ్యోల్బణంపై ప్రజల్లోకి వెళ్లాలని.. దేశమంతా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పిలుపిచ్చారు. మోదీ ప్రభుత్వ జమానాలో రాజ్యాంగంపై దాడి కొనసాగుతోందన్నారు. కులగణన అనేది ప్రజల డిమాండ్ అని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై పోరాటం కొనసాగుతుందన్నారు. సైన్యంలో ‘అగ్నిపథ్’ స్కీంను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రైల్వే భద్రతపై ధ్వజమెత్తారు. రైళ్లు రోజూ పట్టాలు తప్పడం రివాజైందన్నారు. వాతావరణ సంబంధ ప్రకృతి విపత్తులు, మౌలిక వసతుల ధ్వంసం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
Updated Date - Aug 14 , 2024 | 05:22 AM