Nirmala Sitharaman: రాష్ట్రానికి అదనపు నిధులు అందజేశాం.. రాష్ట్రాలకు పన్నుల వాటాలో పక్షపాతం లేదు
ABN, Publish Date - Jan 05 , 2024 | 08:56 AM
పన్నుల వాటాకు సంబంధించి ఎలాంటి వివక్ష చూపడం లేదని, అన్ని రాష్ట్రాలకు సమానంగా అందజేస్తున్నామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) స్పష్టం చేశారు.
- సందేహాలు నివృత్తి చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే
- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
పెరంబూర్(చెన్నై): పన్నుల వాటాకు సంబంధించి ఎలాంటి వివక్ష చూపడం లేదని, అన్ని రాష్ట్రాలకు సమానంగా అందజేస్తున్నామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేలా ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ను చేపట్టారు. ఆ క్రమంలో స్థానిక వెస్ట్ మాంబళంలో గురువారం ‘మన లక్ష్యం అభివృద్ధి భారతం’ అనే పేరుతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... తమిళనాడుకు కేంద్రప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారని, కానీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తోందన్నారు. నాలుగు వందే భారత్ రైళ్లు తమిళనాడులోనే నడుస్తున్నాయని తెలిపారు. 2014-2023 వరకు తమిళనాడు నుంచి కేంద్రప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.6.23 లక్షల కోట్లు అందగా, రాష్ట్రప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం అందించిన నిధులు రూ.6.96 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు. ఆ ప్రకారం, రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో సేకరించిన నిధుల కన్నా అధికంగానే అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం సెస్ పన్ను వసూలుచేస్తూ తమిళనాడుకు ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారని, సెస్ పన్నుతో పాఠశాల భవన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. జీఎ్‌సటీ పన్ను పూర్తిగా రాష్ట్రాలకే అందజేస్తున్నామని తెలిపారు. ఎస్‌జీఎస్టీ అనే స్టేట్ జీఎస్టీ పన్ను 100 శాతం రాష్ట్రాలకే వెళుతోందన్నారు. ఐజీఎ్‌సటీలో 50 శాతం రాష్ట్రాలకే అందిస్తున్నామన్నారు. పన్నుల నుంచి రాష్ట్రాలకు ఎంత నిధులు కేటాయించాలనేది ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. దీపావళి, సంక్రాంతి తదితర పండుగలను పరిగణలోకి తీసుకొని నెల ముందుగానే నిధులు అందజేయడం జరుగుతుందన్నారు. పన్ను కేటాయింపులపై అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Updated Date - Jan 05 , 2024 | 08:56 AM