జమిలికి కేంద్రం సై!
ABN, Publish Date - Sep 19 , 2024 | 06:05 AM
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు దశల వారీగా జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదించింది.
కేంద్రం కీలక నిర్ణయం.. కోవింద్ కమిటీ సిఫారసులకు క్యాబినెట్ ఓకే
విస్తృత స్థాయిలో చర్చలు నిర్వహిస్తాం
ఏకాభిప్రాయ సాధనతో ముందుకు వెళ్తాం
వ్యతిరేకించే పార్టీలూ వైఖరి మార్చుకుంటాయి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఈ నిర్ణయంతో దేశ ప్రజాస్వామ్యం
మరింత చైతన్యవంతం: ప్రధాని మోదీ
పంట ఉత్పత్తులకు మెరుగైన ధరలు
35 వేల కోట్లతో పీఎం-ఆశ కొనసాగింపు
ఫాస్పేట్, పొటాష్‌పై 24 వేల కోట్ల సబ్సిడీ
గిరిజనుల అభ్యున్నతికి 79,156 కోట్లు
చంద్రయాన్-4, వీనస్ మిషన్‌కు ఆమోదం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు దశల వారీగా జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని సాధించి, దీనిని అమలు చేయాలని తీర్మానించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్రం క్యాబినెట్ సమావేశమైంది. జమిలి ఎన్నికలతోపాటు పలు ఇతర నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రైతులకు పంట ఉత్పత్తులకు ప్రోత్సాహకర ధరలు అందించటానికి వీలుగా పీఎం-ఆశ పథకాన్ని రూ.35,000 కోట్లతో కొనసాగించాలని నిర్ణయించింది. చంద్రుడి మీదికి భారతీయ వ్యోమగాములను తీసుకెళ్లే చంద్రయాన్-4 మిషన్‌కు అంగీకారం తెలిపింది. క్యాబినెట్ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్లకు వెల్లడించారు. జమిలి ఎన్నికలకు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయని.. దీనిని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఒత్తిడికి గురై వైఖరి మార్చుకుంటాయన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జరిపిన సంప్రదింపుల్లో పాల్గొన్న వారిలో 80 శాతానికిపైగా జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపారని, ముఖ్యంగా యువత ఈ ప్రతిపాదనను బలంగా సమర్థించారని వెల్లడించారు. కోవింద్ కమిటీ సిఫార్సులపై దేశవ్యాప్తంగా పలు వేదికల మీద చర్చలను నిర్వహిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించాలన్నది ప్రభుత్వ అభిమతమన్నారు. చర్చల ప్రక్రియను ముగించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ముసాయిదా బిల్లును రూపొందిస్తుందని, క్యాబినెట్ ఆమోదంతో పార్లమెంటులో ప్రవేశపెడుతుందని వెల్లడించారు. కాగా, జమిలి ఎన్నికల్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని విలేకర్లు అడగ్గా.. అశ్వినీ వైష్ణవ్ సూటిగా సమాధానం చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత హయాంలోనే దీనిని అమలు చేస్తుందంటూ హోంమంత్రి అమిత్‌షా చెప్పారని గుర్తు చేశారు. జమిలి ఎన్నికలపై పార్లమెంటులో ఒకే బిల్లుగానీ.. కొన్ని బిల్లులనుగానీ ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికలను ఆమోదిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశ ప్రజాస్వామ్యం మరింత చైతన్యవంతమవుతుందని, ప్రాతినిధ్యం పెరుగుతుందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
క్యాబినెట్ ఇతర నిర్ణయాలు
రైతులకు పంట ఉత్పత్తులకు ప్రోత్సాహకర ధరలను ఇవ్వటానికి వీలుగా ‘ప్రధానమంత్రి రైతు ఆదాయ సంరక్షణ పథకం’ (పీఎం-ఆశ) కొనసాగింపు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నిత్యావసరాల మీద పడి సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి కూడా ఈ పథకం అవసరమని క్యాబినెట్ భావించింది. ఈ పథకానికి 15వ ఆర్థిక సంఘం గడువైన 2025-26 వరకూ రూ.35,000 కోట్ల మొత్తం కేటాయించింది. ధరల మద్దతు, ధరల స్థిరీకరణ నిధి, లోటు ధరల చెల్లింపులు, మార్కెట్ జోక్యం పథకాలను కలిపి పీఎం-ఆశ పేరుతో ఒకే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. రైతులకు మద్దతు ధరల భరోసా కల్పించటం దీని లక్ష్యం.
2024-25 రబీ సీజన్‌కు ఫాస్పేట్, పొటాషియం ఎరువులపై రూ.24,474 కోట్ల సబ్సిడీ. దేశవ్యాప్తంగా గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం రూ.79,156 కోట్లతో ప్రధానమంత్రి జన్‌జాతియా గ్రామ్ అభియాన్ పథకం.
ఐఐటీ, ఐఐఎంల మాదిరిగా ముంబైలో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ’ని నెలకొల్పుతారు. భారత్‌ను కంటెంట్ హబ్‌గా మార్చటం, మీడియా, వినోదం రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం లక్ష్యంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేస్తారు.
బయోటెక్నాలజీ రంగంలో అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించటం కోసం బయో-రైడ్ పథకం.
త్వరలో లా కమిషన్ నివేదిక!
జమిలి ఎన్నికలకు సంబంధించి లా కమిషన్ కూడా తన నివేదికను త్వరలో వెలువరించే అవకాశం ఉంది. 2029 నుంచి దీనిని అమలు చేయాలని లా కమిషన్ సిఫార్సు చేయవచ్చని అంచనాలున్నాయి. వాస్తవానికి, స్వాతంత్ర్యానంతరం 1951 నుంచి 1967 వరకూ దేశంలో జమిలి ఎన్నికలే జరిగాయి. ఆ తర్వాత కాలంలో మధ్యంతర ఎన్నికలు తదితర పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
Updated Date - Sep 19 , 2024 | 06:05 AM