Womens News: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై నెలకొక ప్రత్యేక సెలవు
ABN, Publish Date - Aug 15 , 2024 | 05:06 PM
పంద్రాగస్టు వేడుకల వేళ ఒడిశాలోని(Odisha) బీజేపీ సర్కార్ వనితలకు శుభవార్త చెప్పింది. మహిళా ఉద్యోగుల కోసం ఒక రోజు నెలసరి సెలవు (Menstrual Leave) పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.
భువనేశ్వర్: పంద్రాగస్టు వేడుకల వేళ ఒడిశాలోని(Odisha) బీజేపీ సర్కార్ వనితలకు శుభవార్త చెప్పింది. మహిళా ఉద్యోగుల కోసం ఒక రోజు నెలసరి సెలవు (Menstrual Leave) పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఈ పాలసీ వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు కటక్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పార్వతి పరీదా ప్రకటన చేశారు. ఈ పాలసీ వెంటనే అమల్లోకి వస్తుందని ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవును తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
దేశవ్యాప్తంగా విస్తృత చర్చ..
దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినులకు నెలసరి సెలవులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నెలలో మూడు రోజుల నెలసరి సెలవులు ఇవ్వాలంటూ 2022లో ఓ బిల్లును ప్రతిపాదించినప్పటికీ దానికి ఆమోదం తెలపలేరు. ఈ మధ్యే సుప్రీంకోర్టు కూడా నెలసరి అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘వనితలకు ఈ సెలవులు ఇస్తే మరింత ఎక్కువ మంది ఉద్యోగాల్లో చేరేందుకు ప్రోత్సాహం అందించినట్లవుతుంది. అయితే ఈ నిబంధన తప్పనిసరని కంపెనీల యజమానులను బలవంతపెడితే వ్యతిరేకత రావచ్చు. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గొచ్చు. ఇలా జరగాలని మేం కోరుకోవట్లేదు. వనితల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారొచ్చు. అలా జరగకుండా జాగ్రత్తపడాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.
బిహార్‌లో రెండ్రోజులపాటు సెలవులు..
నెలసరి సెలవులపై తాజాగా చర్చ జరుగుతున్నప్పటికీ బిహార్‌లో1992 నుంచే అక్కడి మహిళా ఉద్యోగులకు రెండు రోజుల నెలసరి సెలవులు ఇస్తున్నారు. 2023 నుంచే కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు మూడు రోజుల సెలవులు ప్రకటించింది. ప్రభుత్వాలతోపాటు కొన్ని యూనివర్సిటీలు కూడా నెలసరి సెలవులను ప్రకటించాయి. వాటిల్లో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, తేజ్‌పూర్, అస్సాంలోని గుహవాటి, చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీల విద్యార్థులకు నెలసరి సెలవులు ప్రకటించాయి. జొమాటో వంటి కొన్ని ప్రైవేటు కంపెనీలు సైతం మహిళలకు రుతుక్రమ సెలవులను ఇస్తున్నాయి. కాగా.. సదరు బిల్లులను చట్ట సభల్లో ఆమోదించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు.
Updated Date - Aug 15 , 2024 | 05:08 PM