ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తొలి రోజే ‘అదానీ’ రచ్చ

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:26 AM

అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ తదితరులపై అమెరికా కోర్టులో లంచాల అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ కోసం, పార్లమెంటరీ సంయుక్త బృందం (జేపీసీ) ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులు పట్టుబట్టారు.

లంచాల వ్యవహారంపై అట్టుడికిన సభలు

జేపీసీ, చర్చకు విపక్షాల పట్టు

లోక్‌సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాల

తిరస్కరణ.. సభలు రేపటికి వాయిదా

తొలి రోజే ‘అదానీ’ రచ్చ లంచాల వ్యవహారంపై జేపీసీ, చర్చకు విపక్షాల పట్టు.. అట్టుడికిన పార్లమెంటు

న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల్లో గందరగోళం చెలరేగింది. అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ తదితరులపై అమెరికా కోర్టులో లంచాల అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ కోసం, పార్లమెంటరీ సంయుక్త బృందం (జేపీసీ) ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులు పట్టుబట్టారు. ఇందుకు అధికారపక్షం నిరాకరించడంతో వారు ఆందోళనకు దిగారు. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే.. అదానీ ముడుపుల అంశంపై చర్చకు కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వీటిని చైర్మన్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు. ఖర్గేకు మాట్లాడే అవకాశమిచ్చారు. సభ ఎజెండాను సస్పెండ్‌ చేసి చర్చ చేపట్టాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. అదానీ నిర్వాకంతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ మసకబారిందని.. అయినా ప్రధాని మోదీ ఆయనకు మద్దతిస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఈ అంఽశంపై కూలంకషంగా చర్చించాలని ఇతర విపక్ష ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. చైర్మన్‌ చివరకు సభను బుధవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలో కూడా అదే గందరగోళం తలెత్తింది. సభ మొదలుకాగానే.. చనిపోయిన సభ్యులకు సంతాపం తెలుపుతూ స్పీకర్‌ ఓం బిర్లా తీర్మానం చదివారు. వెంటనే కాంగ్రెస్‌ ఎంపీలు వేణుగోపాల్‌, హిబీ ఈడెన్‌, మనీశ్‌ తివారీ, మాణిక్కం ఠాగూర్‌ అదానీ లంచాలపై చర్చించాలని, ఈ అంశంపై జేపీసీని వేయాలని డిమాండ్‌ చేస్తూ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని కోరారు. సభాపతి అంగీకరించకపోవడంతో నినాదాలు చేశారు. దీంతో ఆయన సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు జేపీసీకి పట్టుబట్టడంతో బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం పార్లమెంటు భవనంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నారు. భారత రాజ్యాంగం 1949 నవంబరు 26న అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇంకోవైపు.. శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో వక్ఫ్‌ సవరణ బిల్లు కీలకమైనది.


ఏకతాటిపైకి..

ఉభయ సభల భేటీకి ముందు ఇండియా కూటమి నేతలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ఐక్యంగా పట్టుబట్టాలని నిర్ణయించారు. ఉభయసభలూ వాయిదాపడ్డాక ఎంపీలు వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, ప్రమోద్‌ తివారీ తదితరులు మాట్లాడారు. అదానీపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందన్నారు.

జేపీసీ గడువు పొడిగించాలి

వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ కాలపరిమితిని పొడిగించాలని ఈ కమిటీలోని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. బిల్లుపై విస్తృతమైన చర్చ జరగాలంటే కమిటీకి సహేతుకమైన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులను కాజేసేందుకే కేంద్రప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆరోపించింది.

మహారాష్ట్ర ఓటమిని జీర్ణించుకోలేకే..

ఉభయసభల కార్యకలాపాలను విపక్షాలు స్తంభింపజేయడంపై బీజేపీ మండిపడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని జీర్ణించుకోలేక అదానీ అంశాన్ని అడ్డుపెట్టుకుని తమపై దాడిచేస్తున్నాయని బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ధ్వజమెత్తారు. ‘ఎన్నికల్లో పరాజయాలతోమీలో నిరాశానిస్పృహలు ఏర్పడి ఉండొచ్చు. దానికి సభలను అడ్డుకుని ప్రతిఘటిస్తారా’ అని ప్రశ్నించారు. విపక్షాల చర్య ప్రజలపై దాడేనని గిరిరాజ్‌సింగ్‌ ఆరోపించారు.

Updated Date - Nov 26 , 2024 | 03:26 AM