ప్రధాని ప్రసంగానికి ప్రతిపక్షాల అంతరాయం
ABN, Publish Date - Jul 03 , 2024 | 04:11 AM
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సమయంలో ప్రతిపక్షాలు అంతరాయం కలిగించడాన్ని ఖండిస్తూ మంగళవారం లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించింది.
మణిపూర్ ఎంపీకి అవకాశం ఇవ్వాలని ఆందోళన
ఈ వైఖరిని ఖండిస్తూ అధికార పక్షం తీర్మానం
న్యూఢిల్లీ, జూలై 2: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సమయంలో ప్రతిపక్షాలు అంతరాయం కలిగించడాన్ని ఖండిస్తూ మంగళవారం లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించింది. 18వ లోక్‌సభ తొలి సమావేశాల చివరి రోజున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రధాని సిద్ధం కాగా విపక్షాలు అడ్డుకున్నాయి. ప్రధాని మాట్లాడానికి ముందు మణిపూర్ ఎంపీకి అవకాశం ఇవ్వాలని కోరాయి. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీకి అవకాశం ఇచ్చామని, మరో ఎంపీకి అవకాశం ఇవ్వలేమని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇందుకు నిరసన తెలుపుతూ మణిపూర్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. వారికి మరికొంతమంది కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు తోడయ్యారు. మణిపూర్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల చర్యను ఖండిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హోంమంత్రి అమిత్ షా సమర్థించారు. ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులను వెల్‌లోకి పంపిస్తున్నారంటూ విపక్ష నేత రాహుల్ గాంధీనిను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్‌కు 90 నిమిషాల సమయం ఇచ్చామని, కానీ ఆయన ప్రవర్తన పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా లేదని అన్నారు.
103% ఉత్పాదకత సాధించిన లోక్‌సభ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. 34గంటల పాటు ఏడు సిట్టింగ్‌లు జరిగాయని, 103 శాతం ఉత్పాదకత సాధించిందని స్పీకర్ ప్రకటించారు. ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 18గంటల పాటు చర్చ జరగగా 68మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.
Updated Date - Jul 03 , 2024 | 07:14 AM