ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జస్టిస్‌ శేఖర్‌ యాదవ్‌పై అభిశంసన నోటీసు

ABN, Publish Date - Dec 14 , 2024 | 04:28 AM

విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ను పదవి నుంచి తొలగించేందుకు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు నిర్ణయించాయి.

అలహాబాద్‌ హైకోర్టు జడ్జిని తొలగించాలి

55 మంది పార్లమెంటు సభ్యుల సంతకాలు

రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అందజేత

మైనార్టీలపై విద్వేష ప్రసంగం చేశారని ఆరోపణ

రాజ్యాంగ విలువలను ఉల్లంఘించినట్టు ఫిర్యాదు

వీహెచ్‌పీ సభలో చేసిన ఉపన్యాసంపై అభ్యంతరం

న్యూఢిల్లీ, డిసెంబరు 13: విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ను పదవి నుంచి తొలగించేందుకు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు 55 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పి.సి.మోదీకి సమర్పించాయి. సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌ టంఖా, దిగ్విజయ్‌ సింగ్‌, కె.టి.ఎస్‌ తుల్సి, డీఎంకే సభ్యుడు పి.విల్సన్‌, సీపీఎం సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ తదితరులు ఉన్నారు. విశ్వహిందూ పరిషత్‌ లీగల్‌ సెల్‌ ఈ నెల 8న అలహాబాద్‌ హైకోర్టు ఆవరణలో ఉమ్మడి పౌర స్మృతిపై నిర్వహించిన సదస్సులో జస్టిస్‌ యాదవ్‌ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని పక్షపాతపూరిత, విద్వేషపూరిత ప్రసంగం చేశారని ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో పాటించాల్సిన నైతిక విలువలపై సుప్రీంకోర్టు 1997 మే 7న ‘న్యాయ జీవితంలో విలువల పునరుద్ఘాటన’ పేరుతో ప్రవర్తన నియమావళి జారీ చేసిందని, ప్రస్తుతం జస్టిస్‌ యాదవ్‌ చేసిన ప్రసంగం అందుకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యా జడ్జీల విచారణ చట్టం-1968 ప్రకారం తమ నోటీసును రాష్ట్రపతికి పంపించి సభలో ప్రవేశపెట్టేలా ఆమోదం తీసుకోవాలని కోరారు.


తొలగించే ప్రక్రియ ఇదీ...

దవిలో కొనసాగేందుకు న్యాయమూర్తి అసమర్థుడని భావిస్తే తొలగించేందుకు రాజ్యాంగంలోని 124(4) అధికరణం, జడ్జీల విచారణ చట్టం-1968లో విధానాన్ని పొందుపరిచారు. తొలగించేందుకు రాజ్యసభలోగానీ, లోక్‌సభలోగానీ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. దీనిపై లోక్‌సభలో అయితే 100 మంది, రాజ్యసభలో అయితే 50 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. సభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి సభాపతి అనుమతి ఇస్తే.. జడ్జీల విచారణ చట్టం ప్రకారం దర్యాప్తునకు కమిటీ ఏర్పాటవుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీ విచారణ జరిపి సభాపతికి నివేదిక సమర్పిస్తుంది. ఆరోపణలు నిజమని తేలితే పార్లమెంటు ఉభయ సభల్లో దీనిపై చర్చ జరుగుతుంది. సంబంధిత జడ్జి కూడా పార్లమెంటుకు వచ్చి తన వాదన వినిపించుకోవచ్చు. తరువాత తీర్మానంపై ఉభయసభల్లో ఓటింగ్‌ జరుగుతుంది. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మెజార్టీగానీ, మొత్తం సభ్యుల సంఖ్యలో మెజార్టీగానీ లభిస్తేనే తీర్మానం ఆమోదం పొందినట్టవుతుంది. అనంతరం జడ్జిని తొలగించాలని సిఫారసు చేస్తూ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తారు.

Updated Date - Dec 14 , 2024 | 04:28 AM