చిరంజీవి, వైజయంతీ మాలకు పద్మవిభూషణ్ ప్రదానం
ABN, Publish Date - May 10 , 2024 | 05:15 AM
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రముఖ నర్తకి వైజయంతీ మాల బాలికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందజేశారు.
పద్మశ్రీలు స్వీకరించిన వేలు ఆనందాచారి, ఉమా మహేశ్వరి, కూరెళ్ల విఠలాచార్య
రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ప్రదానోత్సవం
హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, రాంచరణ్ తదితరులు
న్యూఢిల్లీ, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రముఖ నర్తకి వైజయంతీ మాల బాలికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, చిరంజీవి కుమారుడు, ప్రముఖ సినీ నటుడు రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసన తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పురస్కారాల ప్రదానంలో భాగంగా ఇద్దరికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీలను రాష్ట్రపతి బహూకరించారు. సుప్రీంకోర్టు తొలిమహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, బీజేపీ నేతలు సత్యవ్రత ముఖర్జీ, ఓ రాజగోపాల్, దివంగత సినీనటుడు విజయకాంత్, లద్దాఖ్ ఆధ్యాత్మిక గురువు తోగ్దాన్ రింపోచే, గుజరాతి పత్రిక జన్మభూమి ఎడిటర్ కుందన్ వ్యాస్, బాంబే సమాచార్ యజమాని హోర్ముస్ జీ కామా తదితరులకు పద్మభూషణ్ ప్రదానం చేశారు. విజయకాంత్, ఫాతిమా బీవి, సత్యవ్రత ముఖర్జీ బంధువులు వారి తరఫున పురస్కారాన్ని స్వీకరించారు. కాగా పద్మశ్రీ పురస్కారాలు స్వీకరించిన తెలుగు వారిలో యాదాద్రి శిల్పకారుడు వేలు ఆనందాచారి, హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి, ప్రముఖ సాహితీ వేత్త, ఇంటినే గ్రంథాలయంగా మార్చిన కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు.
గుజరాత్‌కు చెందిన సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రఘువీర్ చౌదరి, తొలి మహిళా మావటి పర్బతి బారువా, ఆదివాసీ పర్యావరణవేత్త చామి ముర్ము తదితరులు కూడా పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించారు. కాగా, 2024 పద్మ అవార్డుల ప్రదానోత్సవ తొలివిడత కార్యక్రమాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 22న చేపట్టగా.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్, మరికొంత మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందించగా.. గురువారం మిగతా వారికి అందజేశారు.
Updated Date - May 10 , 2024 | 05:15 AM