Kolkata: లంచం ఇవ్వాలనుకున్నారు.. పోలీసులపై అభయ తల్లిదండ్రుల సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Sep 05 , 2024 | 11:07 AM
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గత నెలలో దారుణ హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలు అభయ తల్లిదండ్రులు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయాలని పోలీసులు అనుకున్నారని.. ఇందుకోసం తమకు లంచం ఇవ్వజూపారని వారు ఆరోపించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గత నెలలో దారుణ హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలు అభయ తల్లిదండ్రులు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయాలని పోలీసులు అనుకున్నారని.. ఇందుకోసం తమకు లంచం ఇవ్వజూపారని వారు ఆరోపించారు. తద్వారా కేసును అణచివేసేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ ఘటనకు నిరసనగా కోల్‌కతాలో రాత్రి జరిగిన ఆందోళనల్లో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అనంతరం అభయ తండ్రి మాట్లాడుతూ.. "హత్యాచార కేసులో ప్రజలకు నిజాలు తెలియనివ్వకుండా పోలీసులు ప్రయత్నించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా మాకు అనుమతించలేదు. పోస్టుమార్టం అయ్యేంత వరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లోనే మమ్మల్ని ఉంచారు. మృతదేహాన్ని మాకు అప్పగిస్తున్న తరుణంలో ఓ సీనియర్ పోలీస్ అధికారి మాకు లంచం ఇవ్వజూపారు. దాన్ని మేం తిరస్కరించాం. ఇలా మొదటి నుంచి కేసు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు" అని అన్నారు.
పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ..
హత్యాచార ఘటనపై తొలుత రాష్ట్ర పోలీసుల బృందం విచారణ చేపట్టింది. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటడం, పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు రావడంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐకి కేసును అప్పగిస్తూ కోల్‌కతా హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు స్పీడప్ చేసింది. నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇప్పటికే వివిధ పరీక్షలు నిర్వహించారు. అతనితోపాటు ఆర్‌జీ కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కి కూడా పాలీగ్రాఫ్ పరీక్ష జరిపారు.
సుప్రీంను ఆశ్రయించిన సందీప్..
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh)ను సీబీఐ (CBI) సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఘోష్ తన హయాంలో అవకవతవకలకు పాల్పడ్డారంటూ సీబీఐ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఘోష్‌తో మూడు ప్రైవేటు సంస్థలపై కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి కేసుకు సంబంధించి ఘోష్ నివాసంపై ఆగస్టు 25న సీబీఐ దాడులు జరిపి రోజంతా సోదాలు చేపట్టింది. ఆసుపత్రి సెమినార్ హాలులో ఆగస్టు 9న అత్యాచారం, హత్యకు గురైన ట్రయినీ డాక్టర్ కేసును సైతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
కాగా, ఘోష్ తన హయాంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతోంది. ఘోష్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల రద్దు చేసింది. అయితే ఈ కేసులో తననూ కక్షిదారుగా చేర్చాలన్న తన అభ్యర్థనను హైకోర్టు కొట్టేయడాన్ని సందీప్ ఘోష్ సుప్రీంలో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది. కాగా.. బుధవారం ఘోష్‌ను కోర్టు ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడికి యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
For Latest News click here
Updated Date - Sep 05 , 2024 | 11:08 AM