India Kutami : వేచి చూస్తాం
ABN, Publish Date - Jun 06 , 2024 | 05:53 AM
తమను బీజేపీ ప్రభుత్వం పాలించవద్దని దేశ ప్రజానీకం కోరుకున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చటానికి సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా
బీజేపీ పాలన వద్దని దేశ ప్రజలు తీర్పు ఇచ్చారు
వారి ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం
మోదీకి నైతికంగా ఘోర పరాభవం.. బీజేపీ ఫాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగిస్తాం
భావసారూప్య పార్టీలను ఆహ్వానిస్తున్నాం.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ఆయన నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
న్యూఢిల్లీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): తమను బీజేపీ ప్రభుత్వం పాలించవద్దని దేశ ప్రజానీకం కోరుకున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చటానికి సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల్లో దేశప్రజలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని, బీజేపీకి మెజారిటీ ఇవ్వలేదని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బుధవారం ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. తమ కూటమికి ప్రజలు మద్దతు పలికారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీకి, ఆ పార్టీ అనుసరించే విద్వేష, వివక్షాపూరిత, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ధీటైన జవాబుగా అభివర్ణించారు. ‘రాజ్యాంగానికి మద్దతుగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ధరల పెరుగుదలకు, నిరుద్యోగానికి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ తీర్పు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో కొనసాగే బీజేపీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని కూటమి నిర్ణయించిందన్నారు. ఈ మేరకు కూటమి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని పేర్కొంటూ తీర్మానాన్ని ఖర్గే చదివి వినిపించారు. అంతకుముందు ఇండియా కూటమి నేతల సమావేశాన్ని ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలో మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఐక్యంగా పోరాడిందని, భాగస్వామ్య పక్షాలన్నీ సమర్థవంతంగా పోరాడాయని పేర్కొంటూ కూటమి పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీకి, ఆయన అనుసరించే రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమన్నారు.
ఎన్నికల ఫలితాలు మోదీకి రాజకీయంగా తీవ్ర నష్టదాయకమని, నైతికంగా ఆయనకు ఘోర పరాభవాన్ని మిగిల్చాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ప్రజాతీర్పును తుంగలో తొక్కటానికి మోదీ సిద్ధమయ్యారని విమర్శించారు. రాజ్యాంగ విలువలకు, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీలను ఇండియా కూటమి ఆహ్వానిస్తుందని ఖర్గే పిలుపునిచ్చారు. కాగా ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలు, భవిష్యత్ వ్యూహంపై కూటమి నేతలు చర్చించారు. ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌లను కూటమిలోకి ఆహ్వానించే అవకాశాలపైనా మాట్లాడుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఖర్గేతోపాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, ఎస్పీ అధినేత అఖిలే్‌షయాదవ్, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ (శరద్‌పవార్) పార్టీ నేతలు శరద్‌పవార్, సుప్రియాసూలే, లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, ఆప్ తరపున రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2024 | 12:09 PM