PM Modi: ప్రధానితో మంత్రి ఉదయనిధి భేటీ.. ‘ఖేలో ఇండియా’ పోటీలకు ఆహ్వానం
ABN, Publish Date - Jan 05 , 2024 | 08:43 AM
మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ‘ఖేలో ఇండియా’ పోటీలు జరగనుండడంతో ఆ పోటీల ముగింపు ఉత్సవాలకు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ఉదయనిధి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీని ఆయన నివాసగృహంలో కలుసుకున్నారు. ఆ సందర్భంగా మోదీకి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. ఆ తర్వాత ఖేలో ఇండియా క్రీడాపోటీలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా మోదీ ఉదయనిధితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వీలైతే పోటీల ముగింపు సభకు వస్తానని ప్రధాని మోదీ చెప్పినట్లు సమాచారం.
సోనియా, రాహుల్‌కు ఆహ్వానం..
మంత్రి ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోనూ భేటీ అయ్యారు. వారికీ ఖేలో ఇండియా పోటీల ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా ముగ్గురూ పావుగంటకు పైగా చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఆయన కుటుంబీకుల బాగోగులు గురించి సోనియా, రాహుల్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తోనూ భేటీ అయిన ఉదయనిధి.. ఆయనకూ ఆహ్వానపత్రికను అందజేశారు. ఇదిలా వుండగా ఈ వరుస భేటీల గురించి ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఖేలో ఇండియా పోటీలకు ఆహ్వానించేందుకే తాను వచ్చానని వివరించారు.
Updated Date - Jan 05 , 2024 | 08:43 AM