PM Modi: నలంద.. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మిళితం
ABN, Publish Date - Jun 19 , 2024 | 03:07 PM
నలంద అంటే పేరు కాదని.. భారతదేశ ఆద్యాత్మిక, సాంస్కృతిక సమ్మిళితమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బుధవారం రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు.
పాట్నా, జూన్ 19: నలంద అంటే పేరు కాదని.. భారతదేశ ఆద్యాత్మిక, సాంస్కృతిక సమ్మిళితమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బుధవారం రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అగ్నికీలలు పుస్తకాలను కాల్చవచ్చు.. కానీ జ్ఞానాన్ని మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని నలంద పునరుద్ఘాటిస్తుందన్నారు.
ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేసిన 10 రోజుల్లోనే ఇలా నలంద యూనివర్సిటీకి వచ్చి క్యాంపస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ యూనివర్సిటీ భారతదేశ చరిత్ర మాత్రమే కాదని.. ఆసియాలో ఒక భాగమన్నారు. ఈ యూనివర్సిటీ పునర్నిర్మాణంలో ఇతర దేశాలు సైతం పాలుపంచుకున్నాయని ప్రధాని మోదీ వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు.. ఈ నలంద యూనివర్సిటీలో విద్యను అభ్యసించేందుకు వచ్చేవారన్నారు. దాదాపు 20 దేశాలకు చెందిన విద్యార్థులు.. ఈ నలందలో చదువుకున్నారని గుర్తు చేశారు. ఈ నలంద యూనివర్సిటీ వసుదైక కుటుంబ స్పూర్తిని ప్రతీక అని అన్నారు.
2016లో నలంద యూనివర్సిటీని ఐక్యరాజ్య సమితి వారసత్వ ప్రదేశంగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సీఎం నితీశ్ కుమార్, నలంద యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అరవింద్ పనగారియాతోపాటు 17 దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 19 , 2024 | 03:11 PM