ఢిల్లీలో కాలుష్యం తీవ్రం.. బడుల మూసివేత
ABN, Publish Date - Nov 19 , 2024 | 02:49 AM
ఢిల్లీ కాలుష్యం తీవ్రంగా పరిణమించిన నేపథ్యంలో నాలుగో దశ కార్యాచరణ ప్రణాళిక(జీఆర్‌ఏపీ-4)ను సోమవారం ఉదయం నుంచి అమల్లోకి తెచ్చారు.
న్యూఢిల్లీ, నవంబరు 18: ఢిల్లీ కాలుష్యం తీవ్రంగా పరిణమించిన నేపథ్యంలో నాలుగో దశ కార్యాచరణ ప్రణాళిక(జీఆర్‌ఏపీ-4)ను సోమవారం ఉదయం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా పాఠశాలలను మూసేశారు. 11, 12 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సాఫ్ట్‌వేర్, ఇతర ఐటీ అనుబంధ సంస్థలను వర్క్‌ఫ్రమ్ హోంకు అనుమతించాలని ఆదేశించారు. ఆరు బయట కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. సాధారణ నిర్మాణాలు, కూల్చివేతలను ఇప్పటికే ఆపేయగా, సోమవారం నుంచి కీలక మౌలిక ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా నిలిపేశారు. నిత్యావసరాల సరకు రవాణా తప్ప మిగతా అన్ని సరకు రవాణా వాహనాలను నగరంలోకి రాకుండా ఆపేశారు. మెట్రోలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలు, ఆంబ్యులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు, ప్రజాసంబంధ కార్యక్రమాలకు వెళ్లే ప్రభుత్వ అధికారుల వాహనాలు, అత్యవసరం మీద వెళుతున్న ప్రైవేటు వాహనాలు, బ్యాటరీ వాహనాలను మాత్రమే అనుమతించారు. మిగతా అన్ని ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఢిల్లీలో ప్రస్తుతం వాతావరణ నాణ్యత సూచీ 500 వరకు సూచిస్తోంది. సూచీ 400 దాటితే నాలుగో దశ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తారు. తాజాగా తీసుకుంటున్న చర్యల వల్ల సూచీ 300-400 మధ్యకు వచ్చినా నాలుగో దశ కార్యాచరణ ప్రణాళికను కొనసాగించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
Updated Date - Nov 19 , 2024 | 02:49 AM