Pongal: ‘పొంగల్’ కానుకల పంపిణీ షురూ.. మొత్తం 1.77 లక్షల మందికి ఉచిత చీరలు, ధోవతులు
ABN, Publish Date - Jan 11 , 2024 | 08:10 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 2.19 కోట్ల మంది బియ్యం కార్డుదారులకు పొంగల్ వస్తువులు, నగదు కానుకల పంపిణీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) శ్రీకారం చుట్టారు.
- పంపిణీ ప్రారంభించిన సీఎం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 2.19 కోట్ల మంది బియ్యం కార్డుదారులకు పొంగల్ వస్తువులు, నగదు కానుకల పంపిణీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) శ్రీకారం చుట్టారు. ఆళ్వార్‌పేటలో టీయూసీఎస్ రేషన్‌షాపులో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్డుదారులకు కిలో పచ్చిబియ్యం, కిలో చక్కెర కలిగిన పసుపు సంచిని, చెరకు గడను, రూ.1000 నగదును పంపిణీ చేశారు. అదే సమయంలో ప్రభుత్వం యేటా సంక్రాంతికి అందజేసే ఉచిత చీరలు, ధోవతులను అందజేశారు. తొలుత ఈ పొంగల్ కానుకలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, కేంద్ర ప్రభుత్వోద్యోగులు మినహా తక్కిన బియ్యంకార్డుదారులందరికీ అందిస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఈ పొంగల్ కానుకను బియ్యంకార్డులు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పంపిణీ చేయాలని పలు వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. దీవతో పొంగల్ కానుకల పంపిణీ ఏర్పాట్లు ముగియనున్న తరుణంలో బియ్యంకార్డులు కలిగి ఉన్న అందరికీ ఆ కానుకలను అందిస్తామంటూ మంగళవారం సాయంత్రం స్టాలిన్ ప్రకటించారు. ఆ మేరకు బియ్యం రేషన్‌కార్డుదారులు, శ్రీలంక తమిళుల పునరావాస కేంద్రాల్లో ఉన్న శరణార్థులు సహా 2,19,71,113 మందికి పొంగలి తయారీకి అవసరమైన పచ్చిబియ్యం, చక్కెర, చెరకు గడ, ఉచిత చీరలు, ధోవతులు, రూ.1000 నగదు పంపిణీ బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో కార్డుదారులకు టోకెన్లను పంపిణీ చేసి, రేషన్‌షాపుల వద్ద నిర్ణీత సమయాల్లో రోజుకు 200నుండి 500 మంది వరకు కానుకలను పోలీసుల భద్రతా ఏర్పాట్ల నడుమ పంపిణీ చేశారు.
ఆనందంగా ఉంది....
పంపిణీ అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ... సంక్రాంతి సందర్భంగా బియ్యం కార్డుదారులందరికీ పొంగల్ కానుకలు పంపిణీ చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల వరదలు, తుఫాను కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురైనా, ప్రభుత్వంపై అదనపు వ్యయ భారం పడినా పండుగ పూట రాష్ట్రప్రజలన సంతోషమే ప్రాధాన్యంగా భావించి బియ్యంకార్డు కలిగిన అందరికీ పంపిణీ చేస్తున్నామన్నారు. ఇదే విధంగా రాష్ట్రమంతటా 1.77 కోట్ల మందికి సంక్రాంతి సందర్భంగా ఉచిత చీరలు, ధోవతులు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఆర్ పెరియకరుప్పన్, ఎ. చక్రపాణి, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, శాసనసభ్యుడు డి.వేలు, సహకార ఆహార వినియోగదారుల సంరక్షణ శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే.గోపాల్, ఆహార వస్తువుల పంపిణీ శాఖ కార్యదర్శి హర్‌సహాయ్ మీనా, సహకార సంఘాల రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.సుబ్బయ్యన్ తదితరులు పాల్గొన్నారు.
14 వరకు కానుకలు...
బియ్యం రేషన్‌కార్డుదారులకు ఈనెల 14 వరకు సంక్రాంతి కానుకలను, ఉచిత చీరలు, ధోవతులను పంపిణీ చేయనున్నట్లు ఆహార శాఖ మంత్రి ఎ.చక్రపాణి తెలిపారు. చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేషన్‌షాపుల వద్ద ప్రశాంతంగా కార్డుదారులకు సంక్రాంతి కానుకలను పంపిణీ చేయడానికి టోకెన్లు జారీ చేశామన్నారు. టోకెన్లు లేకపోయినా కార్డుదారులు నేరుగా వెళ్లి పొంగల్ కానుకలను పొందవచ్చునని చెప్పారు. ఈ కానుకలను ఈనెల 14 వరకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రేపు పని చేయనున్న రేషన్ దుకాణాలు
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు శుక్రవారం యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు ఆహార భద్రతా శాఖ విడుదల చేసిన ప్రకటనలో... రేషన్ దుకాణాలకు ప్రతి శుక్రవారం సెలవు దినమని, కానీ, ప్రస్తుతం రూ.1,000 నగదుతో కూడిన పొంగల్ కానుక అందజేస్తుండడంతో ప్రజల సౌకర్యార్థం ఈనెల 12న రేషన్ దుకాణాలు యథావిధిగా పనిచేస్తాయని ఆ శాఖ పేర్కొంది.
Updated Date - Jan 11 , 2024 | 08:10 AM