Pragya Thakur: మోదీని నా మాటలు బాధించి ఉండొచ్చు.. టిక్కెట్ నిరాకరణపై ప్రజ్ఞాఠాకూర్
ABN, Publish Date - Mar 04 , 2024 | 06:50 PM
బీజేపీ తొలి జాబితాలో భోపాల్ లోక్‌సభ సభ్యురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు బదులు అలోక్‌శర్మకు సీటు కేటాయించడంపై సాధ్వీ స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి అసంతృప్తికి కలిగించి ఉండవచ్చని అన్నారు. గతంలో కూడా తాను టిక్కెట్ కోరుకోలేదని, ఇప్పుడు కూడా టిక్కెడ్ అడగడం లేదని చెప్పారు.
న్యూఢిల్లీ: బీజేపీ (BJP) తొలి జాబితాలో భోపాల్ లోక్‌సభ సభ్యురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ (Sadhhi Prajnasingh Thakur)కు బదులు అలోక్‌శర్మ (Alok Sharma)కు సీటు కేటాయించడంపై సాధ్వీ స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి అసంతృప్తికి కలిగించి ఉండవచ్చని అన్నారు. గతంలో కూడా తాను టిక్కెట్ కోరుకోలేదని, ఇప్పుడు కూడా టిక్కెట్ అడగడం లేదని చెప్పారు.
మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూనార్ గాడ్సేను దేశభక్తుడంటూ గతంలో ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదని, ఆమె వ్యాఖ్యలు సమాజానికి మేలు చేసేలా లేవని మోదీ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ ఎప్పటికీ క్షమించేది లేదని కూడా అన్నారు. ఈ క్రమంలో భోపాల్ లోక్‌సభ సీటు దక్కకపోవడంపై ప్రజ్ఞాఠాకూర్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు, తానెప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. "నేను నిజమే మాట్లాడతాను. రాజకీయాల్లో నిజం చెప్పే అలవాటును పెంచుకోవాలి. నేను సన్యాసినిని కూడా. నా వ్యాఖ్యలు వివాదాస్పదమని మీడియా అంటోంది. ప్రజలు మాత్రం నేను నిజం చెప్పానని అంగీకరిస్తున్నారు. విపక్షాలపై దాడిని తిప్పికొట్టేందుకు నేను వ్యాఖ్యలు చేశాను. నా మాటలు ఏవైనా ప్రధానమంత్రిని బాధించి ఉడవచ్చు. అందువల్లే నన్ను ఎప్పటికీ క్షమించనని ఆయన చెప్పి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ నన్ను, నా కార్యాలయాన్ని అవమానించింది. నన్ను రాజకీయ స్టంట్‌లోకి లాగారు. వారిని ఉద్దేశించే నేను వ్యాఖ్యలు చేశారు'' అని ఆమె తెలిపారు. అలోక్‌శర్మకు మీ మద్దతు ఉంటుందా అని అడిగినప్పుడు, మద్దతు కోసం ఆయన అడగాల్సిన అవసరం లేదని, ఆయనను గెలిపిస్తామని, ఈసారి 400 సీట్లు పైనే తాము (బీజేపీ) గెలుచుకుంటామని చెప్పారు.
Updated Date - Mar 04 , 2024 | 06:50 PM