President Draupadi Murmu : పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు
ABN, Publish Date - Jun 28 , 2024 | 05:34 AM
ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు నిజాయితీగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన అవకాశాలను కల్పించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని, పోటీ పరీక్షలైనా, ప్రభుత్వ నియామకమైనా ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా
పరీక్షలు నిజాయితీగా జరగాలి.. నియామకాల్లోనూ ఆటంకాలు ఉండొద్దు
వచ్చే బడ్జెట్‌లో చరిత్రాత్మక నిర్ణయాలు.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!
ఎమర్జెన్సీ.. రాజ్యాంగంపై అతిపెద్ద దాడి: పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు నిజాయితీగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన అవకాశాలను కల్పించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని, పోటీ పరీక్షలైనా, ప్రభుత్వ నియామకమైనా ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరిగాయని, వీటిని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే శిక్షించేందుకు కఠిన చట్టాలు ఉన్నాయని చెబుతూ పేపర్ లీకేజీ ఘటనల్లో నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ‘‘గతంలోనూ వివిధ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగిన సందర్భాలను మనం చూశాం. ఇటువంటి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, కఠిన చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఉత్తర, దక్షిణ, తూర్పు భారతాల్లో బులెట్ ట్రెయిన్ కారిడార్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అధ్యయనం చేస్తుందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ‘హై స్పీడ్ రైలు’ కారిడార్ పనులూ వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గురువారం పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ముర్ము ప్రసంగించారు. సుపరిపాలన, సుస్థిరతపై నమ్మకంతోనే మరోసారి ఎన్డీయేకు ప్రజలు అవకాశమిచ్చారని పేర్కొన్నారు. 18వ లోక్‌సభ అనేక విధాలుగా చరిత్రాత్మకమైనదని, అమృత్ కాలంలో సభ ఏర్పాటైందని చెప్పారు. జమ్మూకశ్మీర్ గురించి శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కనిపించిందని, శుత్రువులకు గట్టిగా బదులిస్తూ అక్కడి ప్రజలు పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. వచ్చే సమావేశాల్లో బడ్జెట్ ఉంటుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉండబోతోందన్నారు. బడ్జెట్‌లో ఆర్థిక, సామాజిక నిర్ణయాలతోపాటు అనేక చరిత్రాత్మక చర్యలు కనిపిస్తాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టామని, గత పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టమైందని పేర్కొన్నారు. ప్రపంచ వృద్థిలో భారత్ వాటా 15 శాతంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని ఆమెతెలిపారు.
ఇప్పటికీ రాజ్యాంగంపై దాడులు
దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అనేకసార్లు దాడులు జరిగాయని, ఇప్పటికీ రాజ్యాంగంపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ముర్ము అన్నారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించడం రాజ్యాంగంపై ప్రత్యక్షంగా జరిగిన అతిపెద్ద దాడి అని, అదో చీకటి అధ్యాయమని తెలిపారు. ఆ చర్యతో దేశమంతా ఆగ్రహానికి లోనైందన్నారు. ఆ అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారని తెలిపారు. కానీ అటువంటి రాజ్యాంగ విరుద్థ శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాదించిందని చెప్పారు.
ప్రపంచమంతా డిజిటల్ ఇండియా వైపే చూస్తోంది
డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించిందని, బ్యాంకుల క్రెడిట్ బేస్ పెంచి వాటిని బలోపేతం చేశామని ముర్ము తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వాణిజ్య, వ్యాపారాన్ని సులభతరం చేసిందని చెప్పారు. ఏప్రిల్‌లో తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దాటాయని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం అయ్యాయని అన్నారు. ప్రస్తుతం.. ప్రపంచం మొత్తం డిజిటల్ ఇండియా వైపు చూస్తోందని చెప్పారు. అదేవిధంగా.. సైనికదళాల్లో స్థిరమైన సంస్కరణల కారణంగా బలగాలు స్వయం సమృద్థి సాధించాయని తెలిపారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయటం, సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేసినట్టు వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయని అన్నారు. సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించిందని చెప్పారు.
ఆయుష్మాన్ భారత్.. గేమ్ చేంజర్
ఆరోగ్య రంగంలో దేశం అగ్రగామిగా ఉన్నదని, అత్యంత వేగంగా పురోగతి సాధిస్తున్నదని ముర్ము పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ అనేది గేమ్ చేంజర్ నిలుస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య ేసవలు అందుతున్నాయని తెలిపారు. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులు కోసం పీఎం సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు రూ.120లక్షల కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో ప్రభుత్వం చిత్తశుద్థితో పనిచేసిందని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ పేదల గౌరవాన్ని పెంచిందన్నారు. దేశంలోని కోట్లాది మంది పేదలకు తొలిసారిగా మరుగుదొడ్లు నిర్మించినట్టు వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద 55 కోట్ల మంది లబ్థిదారులకు ఉచిత ఆరోగ్య ేసవలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. తద్వారా మహాత్మా గాంధీ ఆశయాలు నిజరూపం దాల్చాయని ఆమె తెలిపారు.
1 నుంచి కొత్త నేర చట్టాల అమలు
జూలై 1వ తేదీ నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్రపతి తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి శిక్షా స్మృతులే నేటికీ అమల్లో ఉన్నాయని, వాటిని సంస్కరించడం గొప్ప విషయమని చెప్పారు. కొత్త న్యాయ చట్టాలతో ఒకరిని శిక్షించడం కంటే ఒకరికి న్యాయం చేయడానికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కొత్త చట్టాలు న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. సీఏఏ అనేది కూడా అతిపెద్ద నిర్ణయమని తెలిపారు.
Updated Date - Jun 28 , 2024 | 05:34 AM