Narendra Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. పోలాండ్, ఉక్రెయిన్‌లో మూడు రోజుల పర్యటన!
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:47 AM
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో పొలాండ్‌లో ప్రధాని బస చేయనున్నారు. భారత్, పోలాండ్ (Poland) మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ పర్యటనకు వెళుతున్నారు. మధ్య ఐరోపాలో భారత్ కు కీలక ఆర్ధిక భాగస్వామిగా పోలాండ్ ఉంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షుడు, ప్రధానులతో మోదీ సమావేశం కాబోతున్నారు.
అనంతరం పోలాండ్‌లో ఉన్న ప్రవాస భారతీయులను ప్రధాని కలవబోతున్నారు. వారితో కలిసి ఓ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కాగా, భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల పోలాండ్ పర్యటన అనంతరం 23వ తేదీన మోదీ ఉక్రెయిన్ (Ukraine) వెళ్లబోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం గమనార్హం.
భారత్- ఉక్రెయిన్ ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ప్రధాని పర్యటన ఉండబోతోంది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంపై ఆలోచనలు పంచుకునే అవకాశం కోసం తాను ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆశించారు. తన విదేశీ పర్యటన రెండు దేశాలతో విస్తృతమైన పరిచయాలకు ఉపయోగపడుతుందని, రాబోయే సంవత్సరాల్లో బలమైన మరింత శక్తివంతమైన సంబంధాలు నెలకొల్పడానికి సహాయపడుతుందని విశ్వసిస్తున్నా అని ప్రధాని ఓ ప్రకటన విడుదల చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 21 , 2024 | 11:48 AM