Rajasthan: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం...ఒకే కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం
ABN, Publish Date - Apr 14 , 2024 | 05:36 PM
రాజస్థాన్ లోని చురు-సాలాసర్ హైవేపై ఆదివారంనాడు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఒక ట్రక్కును వెనుకవైపు నుంచి ఢీకొనడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు.
చురు: రాజస్థాన్ (Rajasthan)లోని చురు-సాలాసర్ (Churu-Salasar) హైవేపై ఆదివారంనాడు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. వేగంగా వస్తున్న కారు ఒక ట్రక్కును వెనుకవైపు నుంచి ఢీకొనడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. సికార్‌లోని ఫతేపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కారుకు ఉత్తరప్రదేశ్ నంబర్ ప్లేట్ ఉందన్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి అగ్నిమాపక దళాలు చేరుకున్నాయని, కారులో చెలరేగిన మంటలు అరగంటలో అదుపులోకి వచ్చాయని ఫతేపూర్ కొత్వాలి ఎస్‌హెచ్ఓ సుభాష్ హిజరానియా చెప్పారు. కారులో నుంచి ఆరు మృతదేహాలను వెలికితీశామన్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ట్రక్కులో చెలరేగిన మంటలను కూడా అదుపులోనికి తెస్తున్నామని, అందులో పత్రి (కాటన్) లోడ్ ఉందని ఆయన వివరించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 14 , 2024 | 05:36 PM