CM Sukhu: సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు
ABN, Publish Date - Nov 08 , 2024 | 12:43 PM
నోటికాడకు రావాల్సిన సమోసా రాకుండాపోతే కోపం రాదా మరి!. కచ్చితంగా వస్తుంది. అది సీఎం అయినా సరే. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖకు అందాల్సిన సమోసాలు అందలేదు. దీంతో ఆయనకు కోపం వచ్చిందో, లేక సీనియర్ అధికారులు ఇంకెవరికైనా మండిందేమో గానీ.. సమోసాలు సీఎం వరకు ఎంందుకు చేరలేదని విచారణ మొదలుపెట్టారు.
సిమ్లా: సమోసాలు ఇష్టపడనివారు దాదాపు ఉండరు. అది సీఎం అయినా, సామాన్యుడైనా. కానీ సీఎం తినాల్సిన సమోసాలు వేరొకరి పొట్టలోకి పోయాయి. ఇంత జరిగాక పాలనా యంత్రాంగం ఊరుకుంటుందా!.. అబ్బే అస్సలు ఉపేక్షించదు. తక్షణమే విచారణ కూడా మొదలైంది. వినడానికి కాస్త హాస్యంగా అనిపిస్తున్నా ఇది సీరియస్ విషయమే అంటున్నాడు హిమాచల్ ప్రదేశ్ పోలీసులు.
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సమోసాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఒక సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తినాల్సిన సమోసాలు ఆయన వద్దకు చేరలేదు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలైంది. ఐదుగురు పోలీసులకు షోకాజ్ నోటీసులు కూడా అందాయి. కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ మేరకు విచారణ జరుగుతోంది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అక్టోబర్ 21న సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు రాష్ట్ర సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సైబర్ వింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో సీఎంకు వడ్డించేందుకు ప్రత్యేకంగా, వేడివేడి సమోసాలు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా బాక్సుల్లో తెప్పించారు. అయితే సుఖ్విందర్ సింగ్‌కు అందించకముందే ఆయన సిబ్బంది అందరికీ పంచిపెట్టారు.
నిజానికి ఈ సమోసాలు సీఎంకు మాత్రమే అందించాలనే విషయం ఒక్క ఎస్‌ఐకి మాత్రమే తెలుసని విచారణలో తేలింది. ఆయన ఒక మహిళ ఇన్‌స్పెక్టర్‌కు సమోసాలను అప్పగించారు. వీటిని ఎవరెవరికి ఇవ్వాలనే విషయాన్ని ఏ సీనియర్ అధికారీ తనకు చెప్పకపోవడంతో ముఖ్యమంత్రి సిబ్బందికి, మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ (MT) విభాగం సిబ్బందికి సదరు మహిళా ఇన్‌స్పెక్టర్ అల్పాహారంగా పంపిణీ చేయించినట్టు విచారణలో తేలింది. సమన్వయ లోపం కారణంగా ప్రత్యేకంగా సీఎం కోసం తెప్పించిన సమోసాలు ఆయనకు చేరకుండానే అయిపోయాని బయటపడింది. మరి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఐదుగురు పోలీసులపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి
MS Dhoni: ఎంఎస్ ధోనీ అంటే ఇదీ.. ఆశ్చర్యపోయిన బెంగళూరు దంపతులు..
అమెరికా చరిత్రలో తొలిసారి.. కీలక పదవికి మహిళ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియాకు కీలక సలహా ఇచ్చిన కపిల్ దేవ్
అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి స్పందన.. ట్రంప్‌కు ఓ సలహా
గర్ల్‌ఫ్రెండ్ కొత్త హెయిర్ స్టెయిల్ నచ్చలేదని.. నమ్మలేని పని చేశాడు
For More TS News and Telugu News
Updated Date - Nov 08 , 2024 | 02:01 PM