Sankranti: రేపటినుంచి సంక్రాంతి బస్సులు.. మొత్తం 11 వేల సర్వీసులు నడిపేలా ఏర్పాట్లు
ABN, Publish Date - Jan 11 , 2024 | 07:38 AM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ నుంచి మూడు రోజుల పాటు చెన్నై(Chennai) నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు రాష్ట్ర రవాణా శాఖ నడపనుంది.
- అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
- రవాణాశాఖ హెచ్చరిక
అడయార్(చెన్నై): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ నుంచి మూడు రోజుల పాటు చెన్నై(Chennai) నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు రాష్ట్ర రవాణా శాఖ నడపనుంది. రోజువారీగా నడిపే 2,100 బస్సులతో కలుపుకుని మొత్తం 4,706 బస్సులను ప్రతి రోజూ నడిపేలా చర్యలు తీసుకుంది. మొత్తం మూడు రోజుల పాటు 11,006 బస్సులు నడుపుతారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై నగరానికి వచ్చే ప్రయాణికుల కోసం 8,478 బస్సులను నడపనున్నట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ బస్సులు చెన్నైలోని ప్రధాన బస్టాండ్లు అయిన కోయంబేడు, మాధవరం, కిళంబాక్కంలతో పాటు కేకే నగర్, తాంబ రం, పూందమల్లి నుంచి బయలుదేరి వెళతాయన్నారు. సంక్రాంతి పండుగ కోసం తమ సొంతూళ్లకు వెళ్లే నగరవాసులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతా ల నుంచి చెన్నైకి వచ్చే ప్రయాణికుల కోసం ఈ ప్రత్యేక బస్సులను నడిపేలా చర్యలు తీసుకున్నారు.
ఆరు ప్రాంతాలనుంచి...
సంక్రాంతి స్పెషల్ బస్సులను ఆరు ప్రాంతాల నుంచి నడిపేలా చర్యలు తీసుకున్నారు. పొన్నేరి, గుమ్మిడిపూండి, రెడ్‌హిల్స్ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే బస్సులను మాధవరం నుంచి, పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం వైపు వెళ్లే బస్సులను కేకేనగర్ నుంచి, దిండివనం, విక్రయాండి మీదుగా తంజావూరు, కుంభకోణం వైపు వెళ్లే బస్సులను తాంబరం నుంచి, ఆర్కాడు, ఆరణి, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూరు, కాంచీపురం, చెయ్యారు, తిరుత్తణి ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనాలు పూందమల్లి నుంచి బయలుదేరి వెళతాయన్నారు. విల్లుపురం, మదురై, సేలం, కోయంబత్తూరు, కుంభకోణం డివిజన్లకు చెందిన బస్సులు కోయంబేడు నుంచి వెళతాయన్నారు. తిరుచ్చి, తంజావూరు, కరూర్ మదురై, నెల్లై, తూత్తుక్కుడి, నాగర్‌కోయిల్ తదితర దక్షిణాది జిల్లాలకు వెళ్ళే బస్సులు కిళంబాక్కం బస్టాండు నుంచి వెళతాయని తెలిపారు. అలాగే, 12వ తేదీలోపు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు తిరుచ్చి జాతీయ రహదారి మీదుగా వెళ్లే ఎస్‌ఈటీసీ బస్సులను కిళంబాక్కంలో ఎక్కవచ్చన్నారు. 12 నుంచి 14వ తేదీల మధ్య ప్రయాణించే ప్రయాణికులు కోయంబేడు, కిళంబాక్కం, తాంబరం, శానిటోరియం బస్టాండ్లలో బస్సులు ఎక్కవచ్చన్నారు.
24 గంటలూ ఫిర్యాదుల స్వీకరణ
ఫిర్యాదుల స్వీకరణ కోసం 24 గంటల పాటు నెం.9445014450, 9445014436లలో సంప్రదించవచ్చని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల్లో అధిక ప్రయాణ చార్జీలను వసూలు చేస్తే 1800 425 6151 అనే ఫోన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోజువారీగా నడిపే 2,100 బస్సులతో కలిసి 4,830 ప్రత్యేక బస్సులను, మూడు రోజుల పాటు (మొత్తం 6,459 బస్సులు) నడపనున్నట్టు వివరించారు.
Updated Date - Jan 11 , 2024 | 07:38 AM