Smriti Irani: అందుకే అభ్యర్థిని ప్రకటించడం లేదు.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ చురకలు
ABN, Publish Date - Mar 07 , 2024 | 05:44 PM
కాంగ్రెస్ (Congress) కంచుకోట అమేఠీ నియోజకవర్గం (Amethi Constituency) నుంచి ఇంతవరకు తమ అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించకపోవడంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ అభ్యర్థిని ప్రకటించడంలో వాళ్లు ఆలస్యం చేస్తున్నారంటే.. అమేఠీ పవర్ ఏంటో వాళ్లు గ్రహించినట్లు కనిపిస్తోందని, ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోందని సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ (Congress) కంచుకోట అమేఠీ నియోజకవర్గం (Amethi Constituency) నుంచి ఇంతవరకు తమ అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించకపోవడంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ అభ్యర్థిని ప్రకటించడంలో వాళ్లు ఆలస్యం చేస్తున్నారంటే.. అమేఠీ పవర్ ఏంటో వాళ్లు గ్రహించినట్లు కనిపిస్తోందని, ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోందని సెటైర్లు వేశారు. తన నియోజకవర్గంలో రూ.206 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమేఠీ స్థానం నుంచే పోటీ చేస్తారని, దీనిపై త్వరలోనే పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని.. ఇటీవల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ (Pradeep Singhal) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్మృతి ఇరానీకి మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురవ్వగా.. ‘‘ప్రస్తుతం ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో నాకు తెలీదు. కానీ అమేఠీ నుంచి తమ అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ ధైర్యం చేయలేకపోతోందంటే.. అమేఠీ పవర్ ఏంటో ఆ పార్టీ గ్రహించినట్లు ఉంది. కాంగ్రెస్‌ను ఓటమి భయం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది వారి ఓటమికి స్పష్టమైన సూచన’’ అని ఆమె బదులిచ్చారు.
2024 ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని, భారీ విజయం సాధించబోతోందని స్మృతి ఇరానీ నమ్మకం వెలిబుచ్చారు. తనకు అమేఠీ నియోజకవర్గ ప్రజల ప్రజాప్రతినిధిగా మారేందుకు బీజేపీ మరో అవకాశం కల్పించిందని అన్నారు. తాను 2014లో అమేఠీ రాజకీయాల్లో అడుగుపెట్టానని, అయితే ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయానని గుర్తు చేశారు. అయినా తాను ప్రజలకు సేవ చేస్తూనే వచ్చానని, ఈ క్రమంలోనే 2019లో బీజేపీ తనకు మరో ఛాన్స్ ఇచ్చిందని చెప్పారు. అప్పుడు అమేఠీ ప్రజలు తనని గెలిపించారని, 2019లో ఈ నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర సృష్టించబడిందని స్మృతి ఇరానీ తన అనుభవాల్ని పంచుకున్నారు.
ఇదిలావుండగా.. అమేఠీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. 1967లో ఆ స్థానం ఏర్పడినప్పటి నుంచి 2019 దాకా.. కాంగ్రెస్ అభ్యర్థులే అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. ముఖ్యంగా.. రాహుల్ గాంధీ 2002 నుంచి 2019 వరకు అక్కడ వరుసగా విజయాలు నమోదు చేశారు. కానీ.. 2019 ఎన్నికల్లో మాత్రం స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ అమేఠీ నుంచే పోటీ చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి కాబట్టి.. ఈసారి పోటీ మరింత రసవత్తరంగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 07 , 2024 | 05:44 PM