NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 09 , 2024 | 04:57 PM
ఈ ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ ఎగ్జామ్‌ను (NEET PG Exam) వాయిదా వేయాలంటూ కొంతమంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరించింది.
న్యూఢిల్లీ: ఈ ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ ఎగ్జామ్‌ను (NEET PG Exam) వాయిదా వేయాలంటూ కొంతమంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరించింది. దాదాపు 2 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌ను ప్రమాదంలో పడేయలేమని వ్యాఖ్యానించింది. కాగా నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా జూన్ 23న పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు.
కాగా నగరాల్లో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కష్టమని పేర్కొంటూ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎగ్జామ్ కేంద్రాలకు చేరుకోవడం చాలా మంది విద్యార్థులకు చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. ఏ నగరంలో పరీక్ష కేంద్రం ఉంటుందనేది జులై 31న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) అధికారులు తెలిపారని పేర్కొన్నారు.
ఇక ఆదివారం నిర్వహించాల్సిన పరీక్షా కేంద్రం సమాచారాన్ని గురువారం వెల్లడించారని విద్యార్థుల తరపు న్యాయవాది వాదించారు. రెండు సెషన్‌లలో పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారని, అయితే ‘స్కోర్స్ నార్మలైజేషన్ ఫార్ములా’ను ఇంకా వెల్లడించలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీంకోర్ట్ పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జడ్జిలు మనోజ్ మిశ్రా, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. పరీక్షకు కేవలం 2 రోజుల ముందు వాయిదా వేయాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది.
Updated Date - Aug 09 , 2024 | 05:17 PM